"మేం పోలీసులం.. మీ ఇంటిని సోదా చేయాలి" అంటూ నలుగురు దుండగులు పోలీసు దుస్తులు ధరించి ఓ ఇంటికి వెళ్లారు. యజమానులు ఏం జరుగుతుందో తెలియక... బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉండిపోయారు. ఇల్లంతా గాలించి.. నగదు, బంగారాన్ని తీసుకెళ్లారు. మరుసటి రోజు స్టేషన్కు వెళ్లి వారికి మోసం జరిగిందని తెలుసుకొని లబోదిబోమన్నారు. అచ్చం సినిమాను తలపించిన ఈ ఘటన కర్ణాటక హసన్ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది...
హోసూర్ గ్రామంలో నివాసముంటున్నారు లవన్న గౌడ కుటుంబం. ఆగస్టు 17న అర్ధరాత్రి నలుగురు వ్యక్తులు పోలీస్ దుస్తులు ధరించి లవన్న ఇంటికి వచ్చారు. బెంగళూరు నుంచి వచ్చిన పోలీసుమని చెప్పారు ఆ వ్యక్తులు. మీ సోదరుడు దొంగతనం చేసి ఇక్కడకు వచ్చాడని సమాచారం అందిందని.. ఇంటిని సోదా చేయాలని నమ్మబలికారు. ఖాకీ దుస్తులు వేసుకొని ఉండటం వల్ల సోదా చేయటానికి అనుమతి ఇచ్చాడు లవన్న.
సోదాలు చేసిన దుండగులు ఇంట్లోని నగదు, బంగారం, వెండి వస్తువులను ఓ బ్యాగ్లో వేసుకొని... రేపు ఉదయం వీటిని చిన్నరాయపట్నం పోలీస్ స్టేషన్లో స్వాధీనం చేసుకోవాలని చెప్పి వెళ్లిపోయారు.
మరుసటి రోజు ఉదయం లవన్న స్టేషన్ వెళ్లి జరిగిన విషయం చెప్పి నగదు, బంగారం ఇవ్వమని కోరాడు. సోదా కోసం తామెవరూ రాలేదని పోలీసులు చెప్పిన మాట విని నివ్వెరపోయాడు. సోదరుడితో మాట్లాడి దొంగతనం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నిర్ధరించుకున్నాడు. మోసం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.