దేశంలో స్థూలకాయం సమస్య బహుముఖ నష్టాలు కలిగిస్తోంది. పట్టణ, గ్రామీణ భారతంలో పదేళ్ల కాలంలో ఈ సమస్య రెట్టింపయింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్4) ప్రకారం దేశంలోని చాలా రాష్ట్రాల్లో స్థూలకాయం సమస్య దశాబ్దకాలంలో రెట్టింపు అయినట్లు తేలింది. పురుషుల్లో గోవాలో 15శాతం నుంచి 32 శాతానికి, తమిళనాడులో 14 నుంచి 28 శాతానికి, గుజరాత్‌లో 11 నుంచి 20 శాతానికి, హరియాణాలో 10 నుంచి 20 శాతానికి, బిహార్‌లో 6 నుంచి 12 శాతానికి పెరిగింది. మహిళల్లో ఆంధ్రప్రదేశ్‌లో 17 నుంచి 33 శాతానికి, అరుణాచల్‌ప్రదేశ్‌లో 8 నుంచి 18 శాతానికి, మణిపూర్‌లో 13 నుంచి 26 శాతానికి, హిమాచల్ ప్రదేశ్‌లో 13 నుంచి 28 శాతానికి పెరిగింది. భారత్‌లో మధుమేహానికి ఊబకాయమే కీలక కారకమవుతోంది.
స్థూలకాయులంటే ఎవరు?
ప్రతి వందమంది స్థూలకాయుల్లో 38 మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు కొలమానంగా భావించే ఎత్తూ బరువుల నిష్పత్తి (బీఎంఐ) 25కన్నా ఎక్కువగా ఉంటే స్థూలకాయంగా వ్యవహరిస్తారు. అయితే, సమస్యకు చేరువలో ఉండేవారిని పూర్తిస్థాయిలో స్థూలకాయులుగా నిర్ధరించకున్నా- వీరి శరీరంలో, పొట్ట చుట్టూ కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో నడుము చుట్టుకొలత 90 సెం.మీ.కన్నా ఎక్కువగా, మహిళల్లో 80 సెం.మీ.కన్నా ఎక్కువగా ఉంటే పొట్ట అధికంగా ఉండే ఊబకాయంగా పరిగణిస్తారు. ఇది మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండెపోటు, పక్షవాతం ముప్పుల్ని పెంచుతుంది.
ఇవే కారణాలు..
స్థూలకాయం సమస్యను ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న కోవిడ్-19 వైరస్ సమస్యతో పోల్చిచూడొచ్చు. కోవిడ్-19 వైరస్‌ను నివారించడంలో రవాణా, ఆర్థిక, సామాజిక, ఆహార వ్యవస్థలన్నీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అడవుల్ని నాశనం చేయడం, జంతువులతో మనుషులకు సాన్నిహిత్యం పెరిగిన కారణంగా కోవిడ్-19, సార్స్ వంటి జంతువుల ద్వారా వ్యాపించే వైరస్‌ల పుట్టుక, వ్యాప్తి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో కేవలం వ్యక్తులను మాత్రమే నిందించలేం. అదేవిధంగా ఊబకాయం విషయంలోనూ రవాణా, ఆర్థిక, ఆహార వ్యవస్థల్ని కారణాలుగా చూడాలి. మన నగరాలు ఉబకాయాన్ని ప్రోత్సహించేవిగా కాకుండా, సమస్యను నివారించేవిగా మారాల్సిన అవసరం ఉంది. ఒక నగరంలో ఊబకాయాన్ని నివారించడానికి తీసుకునే చర్యలన్నీ కాలుష్యాన్ని తగ్గించే ప్రయోజనాల్నీ కలిగి ఉంటాయన్న సంగతి గుర్తించాలి. స్థూలకాయం పెరిగేలా చేయడంలో, ముఖ్యంగా చిన్నారుల్లో- ఈ సమస్యకు దారితీసే కారకాల్లో వాయు కాలుష్యం కూడా ఒకటన్న సంగతి గుర్తించాలి.
ఏం చేయాలి?
ముఖ్యంగా... ఆరోగ్యకరమైన ఆహారాల్ని, పానీయాల్ని, తాజా పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, గింజలు వంటివాటిని చవకగా, తేలికగా అందుబాటులో ఉండేలా ఆర్థిక, ఆహార, వ్యవసాయ విధానాలు ఉండాలి. అన్ని సామాజిక, ఆర్థిక సమూహాల్లోని ప్రతి ఒక్కరికీ జీవిత పర్యంతం ఇవన్నీ దక్కేలా చర్యలు తీసుకోవాలి. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు, శీతలపానీయాల మార్కెటింగ్‌పై నియంత్రణ ఉండాలి. ముఖ్యంగా చిన్నారుల విషయంలో ఈ నియంత్రణలు తప్పనిసరి. పట్టణ అడవులు వంటి వాటినీ తప్పనిసరి నిబంధనగా మార్చే అంశాల్ని పరిశీలించాలి. స్థూలకాయాన్ని ఎదుర్కొనే క్రమంలో రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామం కీలక భూమిక పోషిస్తుంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన దారుఢ్య భారత్ (ఫిట్ ఇండియా) కార్యక్రమం ప్రశంసనీయమైనది. అయితే, తగిన ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించినప్పుడే శారీరక దారుఢ్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది.
దారుఢ్య సాధనకు అనుకూలంగా..
దారుఢ్య సాధనలో ప్రజలకు ప్రభుత్వం ప్రోత్సాహక వాతావరణం కల్పించాలి. ఇందుకు విశాలమైన పాదచారుల బాటలు ఉండాలి. ఇవి రహదారితో పోలిస్తే మరీ ఎక్కువ ఎత్తులో కాకుండా, ఎక్కడానికి సౌలభ్యంగా ఉండాలి. రహదారులకు ఇరువైపులా ఆకుపచ్చని ప్రదేశాలు, పాదచారుల బాటలు సహజ సిద్ధమైన శీతలయంత్రాల్లా, ఆక్సిజన్ సిలిండర్లలా పని చేయాలి. విశ్రాంతి కోసం బల్లలు, తాగునీటి సౌకర్యాలతో నడకకు అనుకూలమైన పరిస్థితులు ఉండాలి. పాదచారులు రహదారి దాటేందుకు వీలుకల్పించే జీబ్రా క్రాసింగ్‌లు, అన్ని వయసులవారూ రోడ్డు దాటేందుకు వీలుగా తగినంత సమయం కల్పించే సిగ్నళ్లు ఏర్పాటు చేయాలి. ఇలాంటి సౌకర్యాల వల్ల నడవడాన్ని ఒక గౌరవంగా భావించి, చాలామంది నడక బాట పట్టే అవకాశం ఉంటుంది. మెరుగైన, సమర్థమైన ప్రజా రవాణాతో దారుఢ్యాన్ని ప్రోత్సహించవచ్చు. ప్రజారవాణాను ఉపయోగించే వారు రోజూ కనీసం 8 నుంచి 33 నిమిషాల పాటైనా నడుస్తారు.
ఉద్యానవనాల అభివృద్ధి..
పట్టణాలు, నగరాల్లో సామాజిక అడవులు, భారీ స్థాయి ఉద్యానాల్ని అభివృద్ధి చేసి అన్ని వయసులవారూ ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలి. భవనాల్లో మెట్లు సైతం ఎక్కగలిగేలా ప్రోత్సాహకంగా నిర్మించాలి. దేశంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో కళలు, సాంస్కృతిక కేంద్రాలు అన్ని వయసుల వారినీ ‘ఫిట్‌నెస్ దిశగా ప్రోత్సహించాలి. పాఠశాలల్లో విశాలమైన క్రీడా మైదానాలుండాలి. ఆటపాటల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. వ్యాయామ శిక్షణలో పాల్గొనడం తప్పనిసరి చేయాలి. కార్యాలయాలు, పని ప్రదేశాల్లో శారీరక వ్యాయామాన్ని ప్రోత్సహించేలా మౌలిక సదుపాయాలు కల్పించాలి. శారీరక దారుఢ్యాన్ని ప్రోత్సహించే చర్యలు తీసుకున్నప్పుడే ఊబకాయం బారిన పడకుండా దేశ ప్రజలను కాపాడుకునే అవకాశాలు మెరుగుపడతాయి.
రచయిత్రి -డాక్టర్ షిఫాలక గోయెంకా, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాలో ఆచార్యులు
ఇదీ చూడండి: 'భారత్‌లో మత, సామాజిక స్థితి ప్రాతిపదికన మైనారిటీలపై హింస'