ప్రజాస్వామ్య భారతంలో సమున్నత ఆలయం పార్లమెంట్. అక్కడ అన్ని మతాలకు ఆమోద యోగ్యమైన పవిత్రగ్రంథం.. రాజ్యాంగం. మరి ఇందులోని అంశాలపై సందేహాలు కలిగితే ఎవరిని ఆశ్రయించాలి? ఎవరు ఆ అనుమానం నివృత్తి చేస్తారు? ఈ ప్రశ్నలకు వచ్చే ఒకే సమాధానం.. సుప్రీం ధర్మాసనాలే. ప్రవచకులు.. ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన ధర్మసందేహాలు తీర్చినట్టు రాజ్యాంగంలోని కీలక అంశాలపై ఉన్న అనుమానాలు తీర్చేది.. ఈ న్యాయమూర్తులే. ఇలాంటి సందర్భాలెన్నో పలు కేసుల రూపంలో ఎదురయ్యాయి కూడా.
తొలి రాజ్యాంగ సవరణ..
రాజ్యాంగానికి సవాల్‌గా నిలిచిన సంఘటనల్లో మొదట చర్చించాల్సింది చంపకం దొరై రాజన్xస్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు. 1951లో చంపకం దొరైరాజన్ అనే మహిళ ఆర్టికల్ 15(1) 29 (2) ప్రకారం కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా రిజర్వేషన్లు తప్పు అని ఆదేశికసూత్రాల అమలుకు ప్రాథమికహక్కులు ఉల్లంఘించరాదని తేల్చి చెప్పింది. మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలో వెనకబడినవర్గాలకు కల్పించిన రిజర్వేషన్లు కొట్టివేసింది. ఫలితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. నాటి ప్రధాని నెహ్రూ, న్యాయమంత్రి అంబేడ్కర్, కేంద్ర మంత్రివర్గం చర్చించి భారత రాజ్యాంగంలో మొదటి రాజ్యాంగ సవరణ చేశారు. ఇందులో భాగంగా 15, 16 అధికరణలకు 15.4, 16.4 సబ్ క్లాజులు చేర్చారు.
జ్యూరీ విధానం..
పరస్పర అంగీకారంతో సాగిన వివాహేతర సంబంధాల కేసుల్లో 1959 నాటి నానావతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వాణిజ్యవేత్త ప్రేమ్ అహుజా.. భారత నావికా దళ కమాండర్ కేఎం నానావతి భార్య సిల్వియాతో వివాహేతర సంబంధం కొనసాగించాడన్నది అభియోగం. ప్రేమ్ అహుజాను నానావతి కాల్చి చంపడం శిక్షించదగ్గ నేరం కాదని జ్యూరీ తీర్పు చెప్పింది. ఈ తీర్పు హేతుబద్ధం కాదన్న న్యాయమూర్తి... కేసును బాంబే హైకోర్టుకు బదిలీ చేశారు. హైకోర్టు నానావతికి జీవిత ఖైదు విధించింది. తర్వాత కొన్ని గంటల్లోనే ఆ శిక్షను గవర్నర్ రద్దు చేశారు. గవర్నర్ అతిగా స్పందించారని తప్పుబట్టిన సుప్రీం కోర్టు అదే ఏడాది సెప్టెంబర్‌లో ఆ ఆదేశాలు రద్దు చేయడంతో నానావతిని జైలుకు తరలించారు. జ్యూరీ పద్ధతిలో విచారించిన తుది కేసు ఇదే. ఇలా న్యాయ విచారణ జరగటం సరికాదన్న ఉద్దేశంతో ఆ వ్యవస్థను రద్దు చేశారు.
సుప్రీం సంచలన తీర్పు..
1967లో గోలక్‌నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. గోలక్‌నాథ్ అనే భూస్వామి మరణానంతరం.. అతడి కుటుంబీకులు ఆస్తి హక్కుకు సంబంధించిన 17వ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు.. ప్రాథమిక హక్కులు అత్యంత పవిత్రమైనవని, వాటిని సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని తీర్పు చెప్పింది. 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు భారత రాజ్యాంగ చరిత్రలో నిలిచిపోయింది. కేశవానంద భారతి.. 24వ రాజ్యాంగ సవరణను సవాలు చేయగా అది సరైనదేనని పేర్కొంది. రాజ్యాంగంలోని ఏ అంశమైనా మార్పు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని తేల్చి చెప్పింది. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చరాదని స్పష్టం చేసింది.
21వ అధికరణ పరిధిపై..
1975లో 39వ రాజ్యాంగ సవరణను కొట్టివేయటమూ కీలకంగా చెప్పుకోవాలి. ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్‌నారాయణ్ కేసు విచారణ సందర్భంగా ప్రజాస్వామ్యం, న్యాయసమీక్షలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని తేల్చిచెప్పింది సుప్రీంకోర్టు. 1976లో ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్‌శుక్లా కేసులో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అధికరణలు 14, 21, 22 కింద కోర్టుని ఆశ్రయించే ప్రాథమికహక్కు ఉండదని తీర్పునిచ్చింది. 1978లో మేనకాగాంధీ కేసూ చరిత్రాత్మకమే. ఆమె పాస్‌పోర్ట్‌ను 1977లో భారత ప్రభుత్వం రద్దు చేసింది. కారణం తెలపాలని మేనకాగాంధీ అర్జీ పెట్టుకోగా సమాధానంగా సంబంధిత అధికారులు ప్రజా ప్రయోజనాల రీత్యా ఆ వివరాలు వెల్లడించలేమన్నారు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన సుప్రీం ధర్మాసనం 21వ అధికరణలో ఉన్న జీవించే హక్కుకు ఉన్న విశాల, విస్తృత పరిధి వివరిస్తూ తీర్పునిచ్చింది.
కీలక తీర్పులు..
1980లోని మినర్వామిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత ఉండాలని తీర్పు చెప్పింది. సామాజిక సంక్షేమం కోసం చేపట్టే నిర్దేశక సూత్రాల అమలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించదని తేల్చి చెప్పింది. 1985 షాబానో కేసులో ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రాథమికహక్కుల విఘాతం కలిగిస్తే.. అది చెల్లదని పేర్కొంది. 1984 కేహర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు.. మరణ శిక్ష అమలును సమర్థించింది. 1992లో మండల్ కమిషన్ ఉత్తర్వులు రాజ్యాంగబద్దమేనని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 1994లో ఎస్ఆర్ బొమ్మై కేసులో 356వ అధికరణ కింద రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధింపుపై మార్గదర్శకత్వం చేసింది.
ఇదీ చూడండి: చెడు రాజకీయంతోనే చేటు-ఏడు పదుల్లోకి భారత రాజ్యాంగం