కృష్ణ భగవానుడి పేరు చెప్పి వేల వృక్షాలను నరికివేస్తామంటే అనుమతించబోమని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కూల్చివేసే ప్రతి చెట్టు మూల్య నిర్ధరణ జరగాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ ఎ.ఎస్. బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఒక వృక్షం తన జీవిత కాలంలో ఎంత ప్రాణవాయువును ఉత్పత్తి చేయగలదో వెల్లడించే వివరాలూ ఆ మూల్యాంకనంలో భాగంగా ఉండాలని తెలిపింది.
మథురలో నిర్మించనున్న కృష్ణ-గోవర్ధన్ రహదారి ప్రాజెక్టు కోసం 2,940 వృక్షాలు కూల్చేందుకు అనుమతి కోరుతూ ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా పనుల విభాగం అభ్యర్థనను దాఖలు చేశాయి. ఈ క్రమంలో తాజ్మహల్ పరిరక్షణ విషయమై పర్యావరణవేత్త ఎం.సి మెహతా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది సుప్రీం ధర్మాసనం. విచారణలో భాగంగా ఎన్ని చెట్లను నరికివేయాలని ప్రతిపాదిస్తున్నారో తెలపాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
ఇదీ చూడండి:'సీజేఐ పదవిని వారు ఒక్కసారి కూడా చేపట్టలేదు'