భారత వాయుసేనలో బంగారు బాణాల (గోల్డెన్ యారోస్)కు ప్రత్యేక స్థానం ఉంది. వైమానిక దళంలోని 17వ స్క్వాడ్రన్‌ను ముద్దుగా ఇలా పిలుస్తారు. పేరుకు తగ్గట్లే ఈ స్క్వాడ్రన్ తురుపు ముక్క. అత్యంత కఠినమైన ఆపరేషన్లను మొత్తం ఈ స్క్వాడ్రనే చూసుకొంటుంది. మాజీ ఐఏఎఫ్ చీఫ్ ధనోవా కూడా దీని నుంచి వచ్చిన ఆఫీసరే. మూడు అత్యంత కఠినమైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసింది. . 17వ స్క్వాడ్రన్‌కు స్థావరమైన అంబాలా దేశ సైనిక చరిత్రలో ఒక కీలక భాగం. పాకిస్థాన్‌తో తొలి యుద్ధం నుంచి గతేడాది బాలాకోట్ దాడి వరకు చాలా కీలక పాత్ర పోషించింది. దేశ రాజధానికి దిల్లీకి అత్యంత సమీపంలో ఉండటంతో ఈ స్థావరానికి చాలా ప్రాముఖ్యం ఉంది. అందుకే 17వ స్వ్కాడ్రన్‌కు తొలి బ్యాచ్ రఫేల్‌ను అప్పగిస్తున్నారు.
గోల్డెన్ యారోస్‌కు ఓ ప్రత్యేక స్థానం
1951లో 17వ స్క్వాడ్రన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి గోల్డెన్ యారోస్ అని పేరుపెట్టారు. తొలిసారి అమెరికాకు చెందిన హార్వర్డు-2బీ విమానాలను కేటాయించారు. ఈ విమానాలను అమెరికా తయారు చేస్తుంది. ఆ తర్వాత బ్రిటన్ తయారుచేసిన వారిపైర్ విమానాలు .. అనంతరం రష్యా తయారు చేసిన మిగ్-21లను వినియోగించారు. ఈ స్క్వాడ్రన్ 2016లో విశ్రాంతిలోకి వెళ్లే సమయానికి వీటినే వినియోగిస్తున్నారు. కీలక ఆపరేషన్లలో ఈ విభాగం పాల్గొంది. 1961లో గోవా విమోచనం, 1965 పాక్‌తో యుద్ధం, 1971లో మరోసారి పాకిస్థాన్‌తో తలపడింది. 1988లో ఈ స్క్వాడ్రన్ రాష్ట్రపతి నుంచి ‘కలర్స్’ గౌరవాన్ని అందుకొంది.
సఫేద్ సాగర్ ఇక్కడి నుంచే..
కార్గిల్ యుద్ధం సమయంలో పదాతి దళానికి మద్దతుగా ఉగ్రస్థావరాలపై నిర్వహించిన 'ఆపరేషన్ సఫేద్ సాగర్'లో ఈ విభాగమే పాల్గొంది. దీనికి మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవానే కమాండింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయనే స్వయంగా నిఘా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గగనతలంపై నుంచి పర్వతాల్లో నక్కిన ఉగ్రవాదులపై దాడి చేయడం ధనోవా ముందున్న లక్ష్యం. పూర్తిగా పర్వతాలతో నిండిపోయిన కార్గిల్ ప్రాంతంలో 'గోల్డెన్ యారోస్' దాడులు చేసింది. వాయుసేనలోనే ఇది అత్యున్నత స్క్వాడ్రన్‌గా నిలిచింది. అర్ధరాత్రి వేళ వీరి బృందం అత్యంత ఎత్తైన పర్వత సానువుల్లో బాంబుల వర్షం కురిపించింది. దీంతో మన పదాతి దళాలు ముందుకు కదిలాయి. గత వాయుపోరాటాల చరిత్రలో అంత ఎత్తైన ప్రదేశాల్లో రాత్రి వేళల్లో ఎప్పుడూ దాడి చేయలేదు. కార్గిల్‌తోనే ఇది మొదలైంది.
అంబాలాకు ఆయనే రక్ష..
పంజాబ్‌లోని అంబాలా భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రదేశంలో ఉంటుంది. ఈ ప్రదేశాన్ని సూఫీ పీర్‌బాబా రక్షిస్తారని నమ్ముతారు. అంతేకాదు వాయుసేన కీలక ఆపరేషన్లలో ఆయనే అండగా ఉంటాడని భావిస్తారు. చాలా సైనిక దళాల్లో భగవంతుడిపై ఇటువంటి నమ్మకాలు ఉండటం సహజం. ఇక్కడ సూఫీ పీర్‌బాబాను నమ్ముతారు. 1930లో రాయల్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రధాన కార్యాలయంగా ఉంది. భారత వాయుసేన 1వ స్క్వాడ్రన్‌ను కరాచీ నుంచి ఇక్కడికే తరలించారు.
భారత వాయుసేనకు చెందిన అత్యంత కీలకమైన అస్త్రాలు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ పనిచేసిన అధికారులు వాయుసేనలో చాలా కీలక స్థానాలకు చేరుకోవడం విశేషం. మాజీ చీఫ్ ధనోవా, మాజీ ఎయిర్ వైస్ మార్షల్ సునీల్ నాన్దోకర్ వంటి వారు ఇక్కడ పనిచేశారు.
మొదట అంబాలాకు రావాల్సిందే..
వాయుసేనకు సేవలందించేందుకు కొనుగోలు చేసే సరికొత్త రకం విమానాలు తొలుత ఇక్కడకు రావాల్సిందే. తొలి రెండు జాగ్వర్ స్క్వాడ్రన్‌లు ఇక్కడే ఏర్పాటు చేశారు. మిగ్-21 బైసన్ తొలి స్క్వాడ్రన్ ఇక్కడే ఉంది. ఇప్పుడు రఫేల్ విమానాలు. అంతేకాదు భారత వాయుసేన నిర్వహించిన అత్యంత కీలకమైన ప్రతి ఆపరేషన్‌లో అంబాలా పాత్ర ఉంది. అది 1947-48లో పాక్‌తో యుద్ధం నుంచి 2019లో జరిగిన బాలాకోట్ దాడి వరకు ఇక్కడి లోహవిహంగ బృందాల పాత్ర అత్యంత కీలకం. దేశ రాజదాని దిల్లీని కంటికి రెప్పలా కాపాడాలంటే అంబాలా స్థావరం అత్యాధునిక విమానాలతో పటిష్ఠంగా ఉండాల్సిందే.
ఇదీ చూడండి: రఫేల్‌పై దాడికి ఇరాన్ క్షిపణుల ప్రయోగం!