ప్రీ స్కూళ్లలో విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని ఎన్సీఈఆర్టీ(నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్) స్పష్టంచేసింది. చిన్నారులకు రాతపూర్వక లేదా మౌఖిక పరీక్షలను నిర్వహించి, పాస్, ఫెయిల్ అని నిర్ధరించకూడదని తేల్చిచెప్పింది. కొందరు తల్లిదండ్రుల ఆలోచనలు, ఆశయాలను కోసం ప్రీ స్కూళ్లలో విద్యార్థులకు పరీక్షలు పెట్టే సంప్రదాయాన్ని హానికరమైందిగా అభివర్ణించింది ఎన్సీఈఆర్టీ.
మార్గదర్శకాలు జారీ
ప్రీ స్కూళ్లలో విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది ఎన్సీఈఆర్టీ. అనెక్డోటల్ రికార్డ్స్, చెక్లిస్ట్స్, పోర్ట్ఫోలియో వంటి పద్ధతులను అవలంబించాలని పేర్కొంది. ఇతర విద్యార్థులతో సంభాషించే విధానాన్ని పరిశీలించి వారి సామర్థ్యాన్ని మదించాలని సూచించింది.
విద్యార్థులు ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతున్నారు, వారి సామాజిక సంబంధాలను, సంభాషించే విధానం సహా ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు రికార్డులను తయారు చేయాలని ఉపాధ్యాయులకు ఎన్సీఈఆర్టీ నిర్దేశించింది. విద్యార్థులు ప్రైమరీ పాఠశాలకు వెళ్లే వరకు ఆ రికార్డులను పరిరక్షించాలని ఆదేశించింది. తల్లితండ్రులకు ఆ వివరాలను అందుబాటులో ఉంచాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రవేశాలు, ఉపాధ్యాయుల వేతనాలు సహా తల్లితండ్రులతో ఉండాల్సిన సహకారం గురించి మార్గదర్శకాల్లో పొందుపరిచింది ఎన్సీఈఆర్టీ.