మహిళల భద్రతే లక్ష్యంగా దిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో తిరిగే బస్సుల్లో సీసీటీవీలు, పానిక్ బటన్స్, జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
దిల్లీ రవాణా సంస్థ, క్లస్టర్లకు చెందిన మొత్తం 5500 బస్సుల్లో వీటిని అమర్చనున్నట్టు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఒక్కో బస్సులో మూడు సీసీటీవీ కెమెరాలు, 10 పానిక్ బటన్లు, జీపీఎస్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు బస్సులో ఉండే ఈ పానిక్ బటన్స్ నొక్కితే సమాచారం కమాండ్ సెంటర్‌తో పాటు అనుసంధానించిన పలు వ్యవస్థలకు చేరుతందని స్పష్టం చేశారు. తక్షణమే పోలీసులు అప్రమత్తమై వెంటనే స్పందిస్తారన్నారు.
"తొలుత ఈ నెలాఖరులోపు 100 బస్సుల్లో వీటిని ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత ఏడు మాసాల వ్యవధిలో మొత్తం అన్ని బస్సుల్లోనూ దీన్ని అమలులోకి తీసుకొస్తాం. ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూసే పనిలేకుండా.. ఏ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేలా ఓ యాప్‌ను కూడా రూపొందిస్తున్నాం. త్వరలోనే ఆ యాప్‌ను ఆవిష్కరించబోతున్నాం."
-కేజ్రీవాల్, దిల్లీ ముఖ్య మంత్రి.
ఇదీ చూడండి : దిల్లీని కాపాడాలని పొరుగు రాష్ట్రాలకు సీఎం విజ్ఞప్తి