జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370, 35ఏ రద్దు తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది.
ఆమోదం ఇలా..
ఉదయం సభ ప్రారంభమైన వెంటనే 370, 35ఏ అధికరణల రద్దు తీర్మానం, రాష్ట్ర విభజన, రిజర్వేషన్ బిల్లులను సభ ముందుంచారు అమిత్ షా. పలు విపక్షాలు 370 రద్దు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. వీటిపై విపక్షాలకు వివరణ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి. అనంతరం ఓటింగ్ జరిగింది.
ఆర్టికల్ 370, 35ఏ..
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370, 35ఏ రద్దుకు అనుకూలంగా లోక్‌సభలో 351 మంది సభ్యులు మద్దతిచ్చారు. 72 మంది వ్యతిరేకంగా ఓటేశారు.
పునర్విభజన బిల్లు..
జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలన్న పునర్విభజన బిల్లుకు 370 మంది ఎంపీలు మద్దతు తెలుపగా.. 70 మంది ఈ బిల్లును వ్యతిరేకించారు.
రిజర్వేషన్ బిల్లు ఉపసంహరణ
సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లుపై మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌లో పేద ప్రజలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లును ఆఖరి నిమిషంలో ఉపసంహరించుకుంది. అనంతరం లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది.
రాష్ట్రపతి ఆమోదమే తరువాయి
సోమవారమే రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లులు.. నేడు లోక్‌సభలోనూ ఆమోదం పొందాయి. రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టంగా మారనున్నాయి.
రెండు రోజుల్లోనే....
లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్న భాజపా.. ఆర్టికల్ 370 రద్దు తీర్మానం, జమ్ముకశ్మీర్ పునర్వివిభజన బిల్లులను ఆమోదించుకోవడంలో తిరుగులేని విజయం సాధించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని మోదీ సర్కారు కేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.