ఆరోగ్య రంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. వైద్యులు, వైద్యశాలలు, మందులు, మౌలిక సౌకర్యాల కొరతతో సతమతమవుతోంది. ప్రభుత్వాలు అరకొర చర్యలతోనే సరిపుచ్చుతున్నాయి తప్ప దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా ప్రజలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. రోగుల అవసరాలకు, సౌకర్యాలకు పొంతనే ఉండటం లేదు.
గణాంకాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మందికి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉండాలి. కానీ, 10,189 మందికి ఒక్కరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది వైద్యులు, ఇరవై లక్షల మంది నర్సుల కొరత ఉన్నట్లు అంచనా. దారిద్య్రరేఖకు దిగువనున్న 30 కోట్ల మందికి ఆరోగ్య సంబంధ ఖర్చులు మోయలేని భారమవుతున్నాయి. నాణ్యమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న 117 దేశాల్లో భారత్ 102వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో పొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ మనకన్నా మెరుగైన స్థానంలో నిలవడం గమనార్హం.
ఆరోగ్య బీమా
క్షయ, హృదయ సంబంధ, క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులను నియంత్రించడంలో దేశం వెనకబడి ఉంది. తీవ్రమైన ఆకలితో బాధపడే జనాభా గల 45 దేశాల్లో భారత్ ఒకటి. ఆహార కొరత వల్ల పిల్లలు ఉండాల్సినదానికన్నా 21 శాతం తక్కువ బరువుతో ఉన్నారని ఓ సర్వేలో తేలింది. దేశ జనాభాలో 27 శాతమే ఆరోగ్య బీమా సదుపాయం కలిగి ఉన్నారు. ఆరోగ్య బీమా అభివృద్ధి చెందకపోవడానికి అనేక కారణాలున్నాయి. పేదలకు, గ్రామీణులకు తక్కువ ప్రీమియంతో బీమా సౌకర్యం కల్పించడానికి బీమా సంస్ధలు సుముఖత చూపకపోవడం ప్రధాన కారణం. ఆరోగ్య బీమా, దానివల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమూ ఒక కారణం.
పథకాల కొరత..!
ప్రభుత్వాలు చేపడుతున్న ఆరోగ్య పథకాలు పూర్తిస్థాయిలో ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. తగినమేరకు నిధుల కేటాయింపు లేకపోవడం, క్షేత్రస్థాయిలో పరిస్థితులు సవ్యంగా లేకపోవడం ఇందుకు కారణం. జాతీయ ఆరోగ్య పథకం కింద దేశంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించే కార్యక్రమానికి ప్రభుత్వం 2017లో కేంద్రం శ్రీకారం చుట్టింది. ఆయుష్మాన్ భారత్ పేరుతో 2018 సెప్టెంబరు 23న బీమా పథకాన్ని జాతీయ స్ధాయిలో ప్రారంభించింది. ప్రతి కుటుంబానికి అయిదు లక్షల రూపాయల మేరకు ఆరోగ్య బీమా కల్పించి సుమారు దాదాపు యాభై కోట్ల ప్రజానీకానికి లబ్ధి చేకూరేలా కేంద్రం ప్రణాళిక రూపొందించింది. ఆయుష్మాన్ భారత్ పథకం ఆశించిన లక్ష్యాల సాధనలో వెనకబడి ఉందన్న అభిప్రాయం ఉంది.
మెరుగ్గా చర్యలు
వైద్యం కోసం పెట్టే ఖర్చులో సగటున 20 నుంచి 60 శాతం వరకు మందుల కొనుగోలుకే ప్రజానీకం వెచ్చించాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పేరిట దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు తెరిచి, వాటిలో నాణ్యమైన మందులను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో అయిదువేల జన ఔషధి దుకాణాలు ఉన్నాయి. ఇవి ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో 2020 నాటికి మరో 2,500 దుకాణాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది.
దేశీయోత్పత్తి
2009-13 మధ్యకాలంలో దేశంలో ఆరోగ్య రంగానికి పెట్టిన ఖర్చు స్థూల దేశీయోత్పత్తిలో 0.98 శాతం మాత్రమే. 2014లో ఇది 1.2 శాతం కాగా, 2018 నాటికి 1.4 శాతానికి చేరుకుంది. ఆరోగ్య రంగంపై ప్రభుత్వం పెట్టే ఖర్చులో 30 శాతం ప్రాథమిక వైద్యానికి వెచ్చిస్తోంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరోగ్య రంగానికి పెట్టే ఖర్చు స్థూల దేశీయోత్పత్తిలో 18 శాతం ఉండటం గమనార్హం. భారత్ ఆ మేరకు నిధులు ఎప్పుడు కేటాయించగలదన్న ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే!
పరిష్కారం
సరైన వైద్యసేవలు అందించాలంటే ముందుగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. దారిద్య్రరేఖకు దిగువన, కటిక పేదరికంలో ఉన్న ప్రజలను గుర్తించి, వారికి ఆరోగ్య బీమాను అందించాలి. బీమా ఖర్చులో పూర్తిగా లేదా కొంతవరకు ప్రభుత్వాలు భరించినట్లయితే వారికి ఊరట కలుగుతుంది. ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే వైద్యుల కొరత సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలుస్తేనే
2013లో దేశంలో వృద్ధుల సంఖ్య జనాభాలో ఎనిమిది శాతం. 2050 నాటికి ఈ సంఖ్య 18.3 శాతానికి చేరుకుంటుందని అంచనా. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందువల్ల భవిష్యత్తులో ప్రభుత్వాలకు ఇది పెను సవాలు కాగలదు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, మౌలిక సదుపాయాల కొరత వల్ల వృద్ధులకు సరైన సేవలు అందడం లేదు. ప్రభుత్వం 1999లో వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేకంగా జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టింది.
2011లో వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు పథకాన్ని ప్రారంభించింది. వ్యాధి సోకిన తరవాత నివారణ చర్యలు చేపట్టడం కన్నా ప్రాథమిక దశలో నివారణ చర్యలపై దృష్టి సారించవలసిన అవసరం ఉంది. ఆరోగ్యాన్ని ఓ హక్కుగా గుర్తించిన మాత్రాన ఒరిగేదేమీ లేదు. నిధుల కేటాయింపులను పెంచడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించడం ద్వారానే వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయగలం. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసినప్పుడే మెరుగైన ఫలితాలు ఒనగూడుతాయి!
బి.ఎన్.వి.పార్థసారథి
ఇదీ చూడండి : 'పౌర'చట్టంపై అట్టుడికిన భారతావని.. ఆరుగురు మృతి