మధ్యప్రదేశ్ ఇందోర్‌కు చెందిన జిమ్ శిక్షకుడు నీరజ్ తన వివాహంతో ఫిట్ ఇండియా సందేశాన్నిచ్చాడు. వివాహం వినూత్నంగా చేసుకోవాలనే కోరిక ఉన్న నీరజ్‌కు.. తన పెళ్లితో ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం గురించి అవగాహన కలిగించాలనే ఆశయం కూడా ఉంది. అందుకే 12 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ పెళ్లికూతురు ఇంటికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
పెళ్లికి ఆహ్వానించేటప్పుడే తన ఆశయాన్ని బంధువులు, స్నేహితులతో పంచుకున్నాడు నీరజ్. ఓ మంచి కార్యానికి పూనుకున్నాడని అభినందిస్తూ వారంతా ఈ 'స్వస్థ్ పెళ్లి'లో పాల్గొన్నారు. దాదాపు 12 కిలోమీటర్లు పరిగెత్తి పెళ్లి కూతురు ఇంటికి చేరకున్నారు.
"నేను ప్రజల్లో ఫిట్నెస్ పట్ల అవగాహన తీసుకురావాలని భావించాను. వారిని ప్రోత్సహించాలనుకున్నాను. ఈ రోజుల్లో మనం వ్యాయామాన్ని పూర్తిగా పట్టించుకోవట్లేదు. ఈ రోజు పెళ్లికి వెళ్లాలి, రేపు ఆఫిస్‌కు వెళ్లాలి అంటూ ఏవో సాకులు చెబుతూ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నాం. కానీ, ఇవన్నీ ఉన్నా కూడ మనకోసం కాస్త సమయాన్ని కేటాయించవచ్చు. నేను ఇదే సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే నా పెళ్లిలో పరుగులు తీస్తూ పెళ్లికూతురు ఇంటికి వచ్చా."
-నీరజ్, వరుడు
ఇక కాబోయే భర్త సమాజం గురించి ఇంతలా ఆలోచిస్తూ, కలకాలం తమ పెళ్లి అందరికి గుర్తుండిపోయేలా చేసినందుకు మురిసిపోయిందీ పెళ్లి కూతురు..
"నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు నుంచే తెలుసు కానీ, ఇంత స్పందన వస్తుందని అనుకోలేదు. ఆయన చాలా మంచి పని చేస్తున్నారు. సమాజం కోసం చేస్తున్నారు. ఫిట్ ఇండియా కోసం ఇలా చేయడం చాలా బాగుంది. ఆయనకు నా పూర్తి మద్దతుంటుంది."
-నిఖితా బిలోడ్, వధువు
ఇదీ చదవండి: 48 ఏళ్ల క్రితం విడిపోయిన కుటుంబాన్ని కలిపిన 'ఫేస్బుక్'