ట్రాక్టర్ ర్యాలీ హింసలో ఎర్రకోట ఘటనకు సంబంధించి కొత్తగా మరో 50 మందికి నోటీసులు జారీ చేశారు దిల్లీ పోలీసులు. అంతకుముందు 44 మందికి నోటీసులు పంపారు. దిల్లీ హింసకు కారణమైన అనుమానితులను గుర్తించి వారికి నోటీసులు పంపామని.. ఈ ప్రక్రియను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు రైతులను తప్పుదోవ పట్టించి.. ఎర్రకోట వైపు మళ్లించిన వీడియోలను సేకరించినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్లను సంబంధిత లైసెన్స్ అథారిటీకి ఇచ్చినట్లు వివరించారు. దీంతో పాటు ట్రాక్టర్ యజమానులకు గుర్తించి వారికీ నోటీసులు జారీచేశామన్నారు. దేశరాజధానితో పాటు పంజాబ్, హరియాణాలోనూ దిల్లీ పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. ఫోరెన్సిక్ నిపుణులు సైతం ఘాజిపుర్, ఎర్రకోట, ఐటీఓ కార్యాలయం తదితర ప్రాంతాల్లో తనిఖీలు జరిపి ఆధారాలను సేకరించే పనిలో ఉన్నట్టు స్పష్టం చేశారు.
1700 వీడియో క్లిప్పింగ్స్
శనివారం నాటికి దిల్లీ హింసకు సంబంధించి 1700 వీడియో క్లిప్పింగ్స్‌ను సేకరించారు పోలీసులు. ఈ ఆధారాలను పరిశీలించేందుకు జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 26న రైతులు దిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు ఎర్రకోట వద్దకు చేరుకుని ఓ మతానికి చెందిన జెండాను ఎగురవేశారు. అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో రైతులు- పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది.
ఇదీ చదవండి : సాగు చట్టాలపై పవార్ ట్వీట్లకు తోమర్ కౌంటర్