జమ్ము కత్రాలోని శ్రీ మాతా వైష్టో దేవి ఆలయాన్ని చేరుకునేందుకు దిల్లీ నుంచి బయల్దేరిన వందేభారత్ రైలు 130 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ పచ్చజెండా ఊపిన ఈ రైలు ఎన్నో సౌకర్యాలు, అధునాతన సాంకేతికతల సమాహారంగా నిలుస్తోంది. మరి ఆ రైలులోని ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.
అధునాతన సౌకర్యాలు...
⦁ ప్లాస్టిక్‌ను తరిమికొట్టాలన్న ప్రధాని మోదీ పిలుపును శిరసా వహిస్తూ.. ఈ రైలులోని మొదటి, ఆఖరి బోగీల్లో ప్లాస్టిక్ బాటిళ్ల విచ్ఛిన్న యంత్రాలను ఏర్పాటు చేశారు.
⦁ ఇందులో ప్రయాణికుల సౌకర్యార్థం ఓ ఫ్రిడ్జ్ కూడా ఉంది.
⦁ వృద్ధులు, గర్భిణీ స్త్రీలు సౌకర్యవంతంగా కూర్చునేందుకు అనుగుణంగా.. 180 డిగ్రీలు మార్చుకోగల రివాల్వింగ్ సీట్లున్నాయి.
⦁ స్విచ్ నొక్కగానే తెరుచుకునే సెన్సార్ తలుపులతో అత్యంత ఆధునికంగా రూపుదిద్దుకుంది.
⦁ శుద్ధమైన నీటిని అందించే వాటర్ ప్యూరిఫయర్ ఈ రైలులో భాగమే
⦁ ఈ రైలు బండిలో మొత్తం 16 కోచ్‌లున్నాయి.
⦁ ప్రకృతి అందాలు తిలకించేందుకు, వర్షం పడ్డప్పుడూ యాత్రికులు ఇబ్బందిపడకుండా ఉండేందుకు అద్దాల కిటికీలు ఏర్పాటు చేశారు.
⦁ డ్రైవర్ బోగీలో సూర్య వేడిమిని, బయట నుంచి వచ్చే గాలి శబ్దాన్ని తగ్గించేందుకు సన్ స్రీన్ రోలర్లను ఉపయోగించారు.
అక్టోబర్ 5 నుంచి ప్రయాణికులతో సందడి చేయబోతున్న ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దిల్లీ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి అంబాలా కాంట్, లుథియానా, జమ్ము మీదుగా కత్రా పట్టణానికి మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. మంగళవారం మినహా రోజూ ఈ రైలు నడవనుంది.