కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించడానికి వార్తాపత్రికల నిరంతర సరఫరా అత్యవసరమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటికి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ మంగళవారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. పత్రికలు, టీవీ ఛానళ్ల రోజువారీ విధులకు ఇబ్బందులు కలిగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందులో నిర్దేశించింది.
"ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా వారికి ముఖ్యమైన సందేశాలివ్వడానికి, తాజా పరిస్థితులను ప్రజల ముందు పెట్టడానికి పత్రికలు, టీవీ ఛానళ్ల నెట్‌వర్క్ నిరంతరాయంగా పనిచేయడం అత్యవసరం. తప్పుడు, నిరాధార వార్తలను పరిహరించి అత్యుత్తమ విధానాలను ప్రోత్సహించడంలో ఈ ప్రసార సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించడానికి ప్రయత్నిస్తున్న వీటి రోజువారీ విధులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమాచార, ప్రసార సాధనాలతో ముడిపడిన అన్ని వ్యవస్థలకూ ప్రభుత్వపరంగా తగిన సహకారం అందించాలి"
- కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ సమయంలో కింద పేర్కొన్న ఏ వ్యవస్థకీ ఇబ్బంది కలిగించొద్దని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం.
- ప్రింటింగ్ ప్రెస్‌లు, వార్తాపత్రికలు, మేగజైన్ల పంపిణీ వ్యవస్థలు.
- అన్ని టీవీ ఛానళ్లు, వాటికి అనుబంధ సేవలు అందించే టెలీపోర్టులు, డీఎస్‌ఎన్‌జీలు.
- డీటీహెచ్/హిట్స్ కార్యకలాపాలు, వాటి నిర్వహణ, యాజమాన్యం.
- ఎఫ్‌ఎం / కమ్యూనిటీ రేడియో సర్వీస్ నెట్‌వర్క్స్.
- ఎంఎస్‌ఓ, కేబుల్ ఆపరేటర్స్ నెట్‌వర్క్.
- న్యూస్ ఏజెన్సీలు.
- మీడియా ఉద్యోగులు ప్రయాణించే వాహనాలు, డీఎస్‌ఎన్‌జీ వాహనాలు.
- ప్రసార సాధనాల నిర్వహణతో సంబంధమున్న అన్ని సౌకర్యాలూ నిరంతరం కొనసాగేందుకు అనుమతించాలి.
- నిరంతరం విద్యుత్తు సరఫరా చేయడంతోపాటు, ఇంకా ఏవైనా కావాలని విజ్ఞప్తి చేస్తే అవన్నీ అందుబాటులో ఉంచాలి.
- క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మీడియా సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లు విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమన్వయం చేసుకోవాలి.
ఇదీ చూడండి: కరోనా వైరస్ సోకితే రుచి, వాసన తెలియదు