భాజపా దూకుడుకు కళ్లెం వేసే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ నేత, మాజీ మంత్రి దివంగత ఎన్ఈ బలరాం జయంతిని పురస్కరించుకుని ఈ నెల 25న వేదాలపై సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది.
వేదాలు, పురాణేతిహాసాల్లో ఉద్దండులైన పండితుల సమక్షంలో 'ద భారతీయం-2019' పేరుతో 3 రోజుల కార్యక్రమాన్ని కేరళలోని కన్నూరులో నిర్వహించనుంది సీపీఐ. ఈ కార్యక్రమాన్ని జాతీయ కార్యదర్శి డి.రాజా ప్రారంభిస్తారు. ఇందులో 150 మంది నూతన అభ్యాసకులకు ప్రవేశం కల్పిస్తారు.
ఆర్ఎస్ఎస్ను అడ్డుకోవటమే లక్ష్యం!
కేరళలో భాజపా, ఆర్ఎస్ఎస్ ఎదుగుదలను అడ్డుకోవటమే లక్ష్యంగా వేదాల వైపు దృష్టి పెట్టింది సీపీఐ. యువతను ఆకర్షించేందుకు ఇదొక మార్గంగా ఎంచుకుంది. ఆర్నెల్లలోపు మరో సదస్సు కూడా నిర్వహించే యోచనలో ఉన్నట్టు సమాచారం.
ఆర్ఎస్ఎస్ గతంలో నిర్వహించిన 'బాలగోకులం శోభ యాత్ర'కు పోటీగా కన్నూరు జిల్లాలో ఇటీవల సాంస్కృతిక ర్యాలీ నిర్వహించింది పార్టీ. ప్రస్తుతం వేదాలను నేర్పించనుంది. అయితే ఇలాంటి కార్యక్రమాలు పార్టీ భావజాలానికి వ్యతిరేకమని వాదించే వారూ ఉన్నారు.
ఇదీ చూడండి:- 'కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి- ఇది అత్యవసరం'