రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను.. ఎన్నో ఏళ్లుగా రైతు సంఘాలు, విపక్షాలు కూడా కోరుకుంటున్నాయని తెలిపారు.
గుజరాత్ పర్యటనలో భాగంగా.. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మోదీ. ఈ నేపథ్యంలో రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.
"మా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రైతులు, రైతు సంఘాలు ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్నాయి. ఇప్పుడు రైతులను తప్పుదోవ పట్టిస్తున్న నేతలే.. తమ హయాంలో ఇలాంటి చట్టాలు రావాలని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు దేశం ఓ చారిత్రక నిర్ణయం తీసుకుంటే మాత్రం.. వీరు వ్యతిరేకిస్తున్నారు. అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయినా మేము రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
రైతులకు లబ్ధి చేకూరే విధంగా గుజరాత్ ప్రభుత్వం.. గత 20ఏళ్లుగా పథకాలు రూపొందిస్తోందని ఉద్ఘాటించారు ప్రధాని. సౌర విద్యుత్ సామర్థ్యతను పెంపొందించుకునేందుకు తొలినాళ్ల నుంచి గుజరాత్ కృషి చేసిందన్నారు.
కచ్‌పై ప్రశంసలు..
కచ్‌లో.. దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన పార్కు, ఆటోమేటెడ్ మిల్క్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ ప్లాంట్, లవణ నిర్మూలణ ప్లాంట్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో కచ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కచ్ ప్రజలు నిరాశను కూడా అవకాశంగా మార్చుకుని పైగి ఎదిగారన్నారు. భారీ భూకంపం కూడా కచ్వాసులను ఏమీ చేయలేకపోయిందన్నారు.
![The agriculture reforms that have taken place are exactly what farmer bodies and even Opposition have been asking over the years: Modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9885955_kutch.jpg)
అభివృద్ధి ప్రాజెక్టులతో నూతన సాంకేతిక యుగంవైపు కచ్ అడుగులు వేసిందన్నారు మోదీ. ఆర్థికవ్యవస్థలో నూతన శకం మొదలైందని పేర్కొన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కచ్ ఒకటని కొనియాడారు. కనెక్టివిటీ రోజురోజుకు పెరుగుతోందన్నారు.
ఇదీ చూడండి:- 'రైతుల ఆందోళనతో రోజుకు రూ.3,500 కోట్లు నష్టం'