పాకిస్థాన్ వీసాలు పొందిన 200మందికి పైగా జమ్ముకశ్మీర్‌కు చెందిన యువత ఆచూకీ కోల్పోయిన నేపథ్యంలో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. వారిని ఉగ్రవాద శిబిరాల్లోకి రిక్రూట్ చేసుకొని కశ్మీర్లో సమస్యలు సృష్టించేలా పాకిస్థాన్ శిక్షణ ఇచ్చే అవకాశం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
స్థానికులతోనే సమస్యలు సృష్టించేలా..
పాకిస్థాన్ హైకమిషన్ 2017 జనవరి నుంచి 399 మంది యువతకు పాకిస్థాన్ వీసాలు ఇచ్చింది. వారిలో కశ్మీర్‌కు చెందిన 218 మంది జాడ తెలియడం లేదు. కశ్మీరీ యువతను పాకిస్థాన్ లక్ష్యంగా ఎంచుకుంది. 2019, ఫిబ్రవరిలో పుల్వామా దాడి తర్వాత యువతకు శిక్షణ ఇచ్చి రాష్ట్రంలో ఉగ్రదాడులు చేపట్టాలన్నది పాక్ పన్నాగం’ అని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అమాయక యువత.. పాక్‌కు తిరుగుబాటు యోధులు
ఉగ్రవాద శిక్షణ పొందిన వాళ్లను పాకిస్థాన్ 'స్థానిక తిరుగుబాటు యోధులు'గా గుర్తిస్తోంది. కొన్ని నెలలుగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబడేందుకు చేస్తున్న ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొడుతోంది. కొన్ని రోజుల క్రితమే జమ్ములో నక్కిన ఉగ్రవాదులను సైన్యం ఏరిపారేసింది.
ఇదీ చూడండి: చైనా సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం వేగవంతం