కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోందీ వైరస్. ఈ ప్రాణాంతక మహమ్మారి ఇప్పటివరకు దాదాపు 187 దేశాలకుపైగా వ్యాపించింది. 3 లక్షల మందికిపైగా కొవిడ్ బారినపడ్డారు. మరణాల సంఖ్య 13 వేలు దాటింది. చైనా, ఇటలీ, ఇరాన్ దేశాల్లో వేలమంది మృత్యువాత పడ్డారు.
విదేశాలతో పాటు కరోనా బారిన పడ్డవారి సంఖ్య భారత్‌లోనూ అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 341 మందికి ఈ మహమ్మారి సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఆరు రాష్ట్రాల్లో ఏడుగురు మరణించారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నియంత్రణ చర్యలను మరింత ముమ్మరం చేసింది కేంద్రం.
ఇందులో భాగంగా బ్రిటిష్ హయాంనాటి అంటు వ్యాధుల చట్టం-1897లోని సెక్షన్ 2ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయాలని ఈనెల 11న సూచించారు కేంద్ర కేబినెట్ కార్యదర్శి. తాజాగా ఆ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీని ప్రకారమే.. రాష్ట్రమంతా ఈ నెల 31వరకు లాక్డౌన్ ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇటీవల మహారాష్ట్ర కూడా ఈ చట్టాన్ని అమలు చేసింది.
అంటు వ్యాధుల చట్టం ప్రకారం కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తిని బలవంతంగానైనా ఆసుపత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు చేయించే అధికారం రాష్ట్రప్రభుత్వాలకు ఉంటుంది.
గతంలో ఎప్పుడెప్పుడు అమలు చేశారు?
బ్రిటిష్‌వారి కాలంలో బాంబే రాష్ట్రానికి ప్లేగు వ్యాధి సంక్రమించినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ అంటు వ్యాధుల చట్టం-1897ను అమలు చేశారు.
ఆ తర్వాత దేశంలోకి పలు ప్రాణాంతక వ్యాధులు అడుగుపెట్టినప్పుడు ఈ చట్టాన్ని వినియోగించారు.
2018లో గుజరాత్లో కలరా వ్యాప్తి చెందినప్పుడు, 2015లో చండీగఢ్‌లో డెంగీ, మలేరియాను నియంత్రించేందుకు, పుణెలో 2009లో స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు ఈ అంటువ్యాధుల చట్టాన్ని అమలులోకి తెచ్చారు.
ఈ చట్టం నిబంధనలు ఏమిటి?
ఈ చట్టంలో మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఇందులో
సెక్షన్ 2(1) ప్రకారం...
ఏదైనా రాష్ట్రం లేదా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా ప్రాణాంతక అంటు వ్యాధులు ప్రబలినప్పుడు లేదా భయపెట్టినప్పుడు, ఆ సమయంలో అమలులో ఉన్న సాధారణ చట్టాలు.. ఏ వ్యక్తినైనా ఆధీనంలోకి తీసుకునేందుకు సరిపోవని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే.. ఏ సమయంలోనైనా ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు, నిబంధనలు అమలు చేసేందుకు రాష్ట్రాలకు సర్వాధికారాలు ఉంటాయి.
సెక్షన్ 3- జరిమానా
ఈ చట్టంలోని ఏదైనా నిబంధన లేదా ఉత్తర్వులను ఉల్లంఘిస్తే.. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 (1860 లోని 45) ప్రకారం సదరు వ్యక్తి శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లుగా భావిస్తారు.
సెక్షన్ 4- చట్టం ప్రకారం పనిచేసే వ్యక్తులకు రక్షణ
ఈ చట్టానికి నిబద్ధుడై వ్యవహరించే వ్యక్తికి వ్యతిరేకంగా దావా వేసేందుకు గానీ, ఇతర చట్టపరమైన చర్యలు తీసుకునేందుకుగానీ ఆస్కారముండదు.
అప్పట్లో మరింత కఠినం
బ్రిటిష్ హయాంలో చట్టం అమల్లోకి వచ్చిన సమయంలో నిబంధనలు అత్యంత కఠినంగా ఉండేవి. అప్పటి పాలకులు వాటిని అదే స్థాయిలో అమలు చేసేవారు. ప్లేగు కేసులు ఉన్నాయని అనుమానం వస్తే ప్రభుత్వ సిబ్బంది ఇళ్లలోకి చొరబడి గాలించేవారు. రోగులు సంచరించిన భవనాలు, ఇతర కట్టడాలను కూల్చేసేవారు.
1897లో స్వతంత్ర సమరయోధుడు బాల గంగాధర్ తిలక్‌ను ఇదే చట్టాన్ని అడ్డంపెట్టుకుని 18 నెలలు జైలులో పెట్టారు నాటి బ్రిటిష్ పాలకులు. ప్లేగు నివారణలో అధికారుల వైఫల్యాన్ని తన కేసరి, మహ్రట్ట పత్రికల్లో తిలక్ ఎండగట్టడమే ఈ శిక్షకు కారణం.