ఉత్తర్ప్రదేశ్లో బాలికలపై అరాచకాలు ఆగటం లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ ఘటన తర్వాత అత్యాచారాలు, అపహరణ కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మథురలో 14 ఏళ్ల బాలికపై ఓ 17 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మథురలోని హైవే పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బాలికను నిందితుడు వేరే ప్రాంతానికి తీసుకెళ్లగా రెండు రోజుల తర్వాత తిరిగివచ్చి తనపై జరిగిన అరాచకాన్ని కుటుంబానికి వివరించినట్లు పోలీసులు వెల్లడించారు. అత్యాచారంపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మథుర నగర ఎస్పీ ఉదయ్ శంకర్ సింగ్ తెలిపారు.
నోయిడాలో మరో ఘటన..
యూపీ గ్రేటర్ నోయిడాలో మరో ఘటన వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం జరగగా.. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. నిందితులు, బాధితురాలు దాద్రికి గ్రామంలోని ఒకే కమ్యూనిటికి చెందిన వారని, వారంతో ఒకరికొకరు తెలుసునని పోలీసులు తెలిపారు. ఓ బాలుడిని పంపించి బాలికను సమీపంలోని తమ ఇంటికి రప్పించుకుని ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. బాధితురాలని వైద్య పరీక్షలకు పంపించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ఉత్తర్ప్రదేశ్లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం