ఉపాధ్యాయ దినోత్సవం రోజున తమ గురువులను పూజించుకుంటారు విద్యార్థులు. విద్య నేర్పుతోన్న టీచర్లకు కృతజ్ఞతగా బహుమతులు ఇస్తుంటారు. అయితే.. ఈ ఏడాది పాఠశాల ప్రారంభం రోజున విద్యార్థులకే బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరచాలని నిశ్చయించుకున్నాడు కేరళ కన్నూరుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు. అందుకు తనలోని ప్రతిభతో వినూత్న ఆలోచన చేశాడు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సురేశ్ అన్నూర్.. పయ్యనూర్ కండంగలి శెనోయ్స్ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో హిందీ బోధిస్తున్నాడు. ఆయన అద్భుతమైన చిత్రకారుడు కూడా. డాట్ ఆర్ట్ (చుక్కలతో చిత్రాలు)లో అమోఘమైన ప్రతిభ చూపిస్తున్నాడు.
ప్రస్తుతం కరోనా కారణంగా పాఠశాలలు మూతపడి.. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇంటివద్దే ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో 9వ తరగతికి చెందిన 35 మంది విద్యార్థుల చిత్రాలను డాట్ ఆర్ట్ ద్వారా అద్భుతంగా చిత్రీకరించాడు అన్నూర్. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన తర్వాత వారికి బహుమతిగా ఇస్తాడట.
"చిత్రాలు గీస్తున్నప్పుడు నా జ్ఞాపకశక్తిపైనే ఆధారపడి విద్యార్థుల చిత్రపటాలు పూర్తి చేశాను. చాలా ఏళ్లుగా విద్యార్థులతోనే గడుపుతున్నందున, వారి ముఖాలను స్పష్టంగా గుర్తు చేసుకోగలిగాను. 10వ తరగతిలోకి అడుగుపెట్టే తొలిరోజున ఈ చిత్రపటాలను ఇవ్వాలనుకుంటున్నా. ఇది వారికి చాలా మంచి బహుమతి అవుతుందనుకుంటున్నా. వారికి ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నాను."
- సురేశ్ అన్నూర్, ఉపాధ్యాయుడు.
ఒక్కో చిత్రపటాన్ని పూర్తి చేసేందుకు ఒక రోజు సమయం పట్టిందని తెలిపాడు అన్నూర్. గతంలోనూ ప్రముఖ వక్త, విమర్శకులు సుకుమార్ అళికోడ్, గాయకులు యేసుదాసు, కేఎస్ చిత్రలపై అభిమానంతో.. డాట్ ఆర్ట్‌తో రూపొందించిన వారి చిత్రాలను బహుమతిగా ఇచ్చాడు.
ఇదీ చూడండి: ఈ గణపతిని నిమజ్జనం చేయొద్దు.. కషాయం చేసుకోవాలి!