కార్గిల్ యుద్ధానికి 20ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో గ్వాలియర్ వైమానిక స్థావరంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాయుసేన చీఫ్ మార్షల్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో యుద్ధం నాటి ముఖ్య ఘట్టాలను వీడియోల రూపంలో ప్రదర్శించారు.
కార్గిల్ యుద్ధ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత వాయుసేనకు సంబంధించిన పలు అంశాలను తెలిపారు ధనోవా. యుద్ధంలో విజయం సాధించేందుకు ఆయుధాలను వేగంగా ఆధునికీకరించామని తెలిపారు.
"కీలక సమయంలో విజయం కోసం మిరాజ్-2000 ను అప్‌గ్రేడ్ చేశాం. లైటెనింగ్ లేజర్ డెసిగ్నేటింగ్ భాగం, లేజర్ గైడెడ్ బాంబ్లను 12 రోజుల రికార్డు సమయంలో అమర్చాం. ఈ కృషి ఫలితమే యుద్ధాన్ని భారత్ వైపునకు తిప్పింది."
-బీఎస్ ధనోవా, ఎయిర్ చీఫ్ మార్షల్
కార్గిల్ యుద్ధం విజయంలో మిరాజ్-2000 కీలక పాత్ర పోషించింది. టైగర్ హిల్‌లో శత్రు స్థావరాలు, యుద్ధ ట్యాంకర్లపై విరుచుకుపడింది.
ఈ యుద్ధం ఎప్పటికీ ప్రత్యేకమే..
కార్గిల్ యుద్ధం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ధనోవా పేర్కొన్నారు. యుద్ధ వ్యూహాలు, ఆశ్చర్యకర సంఘటనలు, అకస్మాత్తు దాడులు, కార్గిల్ - సియాచిన్ దాటి దేశం లోపలికి ప్రభావం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయన్నారు. త్రివిధ దళాల వ్యూహాలు, ప్రణాళికలతో అద్భుత విజయాన్ని సాధించామని ఉద్ఘాటించారు ధనోవా.
కార్గిల్ దివస్
జులై 26తో కార్గిల్ యుద్ధం ముగిసి 20 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో దిల్లీతో పాటు జమ్ము కశ్మీర్‌లోని ద్రాస్‌లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని సైన్యం నిర్ణయించింది. జులై 25-27 మధ్య మూడు రోజల పాటు ఈ వేడుకలు జరుగుతాయి.
లక్ష్యాల్లో తేడా..
బాలాకోట్ దాడుల్లో ఉగ్రవాదులే భారత్ ప్రధాన లక్ష్యమని ధనోవా ఉద్ఘాటించారు.
"బాలాకోట్ విషయంలో చెప్పాలంటే మన గగనతలంలోకి పాక్ చొరబడలేదు. మన లక్ష్యం బాలాకోట్‌లోని ఉగ్రవాదులపైనే.. దాన్ని మనం సాధించాం. వారి లక్ష్యం మాత్రం భారత సైన్య స్థావరాలే. ఆ విషయంలో వాళ్లు విఫలమయ్యారు. నియంత్రణ రేఖ దాటి ఎవరూ భారత్‌లో ప్రవేశించలేదు."
-బీఎస్ ధనోవా, ఎయిర్ చీఫ్ మార్షల్
'ఎన్-32కు మరో ప్రత్యామ్నాయం లేదు'
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిపోయిన యుద్ధవిమాన శ్రేణి ఎన్-32పైనా స్పందించారు ధనోవా. పర్వత ప్రాంతాల్లో ఈ యుద్ధవిమానాలు ఇంకా సేవలందిస్తాయని స్పష్టం చేశారు. మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. అయితే అత్యాధునిక యుద్ధవిమానాల కొనుగోలు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఇదీ చూడండి: 'భాజపా.. ఉగ్రవాద సంస్థలా వ్యవహరిస్తోంది'