హరియాణా గురుగ్రామ్‌లోకి ప్రవేశించిన మిడతల దండు దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ పంటలను నాశనం చేసేందుకు సరిహద్దుల్లోకి దూసుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు, అధికారులు అప్రమత్తమయ్యారు.
శనివారం ఉదయం 11.30 సమయంలో సెక్టార్-5, గురుగ్రామ్-మోహిందర్ఘర్, ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే వెంట పెద్ద ఎత్తున మిడతల సమూహం కనిపించింది. మోహిందర్ఘర్ ప్రాంతంలోని ప్రజలను కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని హెచ్చరించారు స్థానిక అధికారులు. గిన్నెలతో శబ్ధాలు చేసి మిడతలను తరమేయాలని కోరారు. ఫలితంగా రైతులు హుటాహుటిన పొలాల వద్దకు వెళ్లి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సంప్రదాయ పద్ధతుల్లో పొగ పెట్టి.. పంటలపై మిడతలు వాలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, హెచ్చరికలు జారీ చేయడం తప్ప అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. మరోవైపు.. మిడతలు విశ్రాంతి తీసుకునే సమయంలో వాటిపై రసాయనాలను పిచికారీ చేయగలమన్నారు హరియాణాకు చెందిన ఓ వ్యవసాయాధికారి.
దిల్లీ అప్రమత్తం..
హరియాణాలోకి దండెత్తిన మిడతలు ఇప్పటికే దిల్లీ సరిహద్దులోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాజ్. ఈ కీటకాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. దక్షిణ, పశ్చిమ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోనూ ఓ దండు..
హరియాణాలో మిడతల దండు వార్త బయటపడ్డ రోజే, ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్పుర్లోనూ చిన్నపాటి మిడతల దండు కనిపించింది. హడలిపోయిన రైతులు పొలాలకు పరుగుతీశారు. వెంటనే అధికారులు ఘటనా స్థలాలకు చేరుకున్నారు. మిడతలను తరిమేందుకు గిన్నెలతో శబ్ధాలు చేయాలని రైతులను కోరారు. రాత్రి వేళ రసాయనాలు పిచికారీ చేస్తామని భరోసా ఇచ్చారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోనూ మిడతలు పంటలకు భారీగా నష్టం కలిగిస్తున్నాయి.
పంటలను స్వాహా చేస్తాయి...
ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉండే దండులో సుమారు 4 లక్షల మిడతలుంటాయి. మిడతలు వాటి శరీర బరువుకు మించి తింటాయి. అంటే కేవలం ఒక్క దండు.. 35 వేల మంది తినే ఆహారాన్ని ఒక్క రోజులోనే స్వాహా చేస్తాయి.
మే నెలలో పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మిడతలు విజృంభించాయి. దేశంలో ఎడారి మిడత, వలస మిడత, బాంబే బాంబే, చెట్లపై వాలే నాలుగు రకాల మిడతలను గుర్తించారు నిపుణులు. వీటిలో ఎడారి మిడత రోజుకు సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించగలదు. కాబట్టి ఈ రకమే అత్యంత ప్రమాదకారి.
అందుకే, వీలైనంత త్వరగా అధికారులు తగిన చర్యలు చేపట్టి, మిడతలను అంతం చేయకపోతే.. అవి పంటలను నాశనం చేస్తాయంటున్నారు నిపుణులు.
ఇదీ చదవండి:నాట్ల సమయంలోనూ మిడతల దాడులు