నిర్భయ దోషులకు డెత్ వారెంట్లు జారీ చేయడం.. చివరి నిమిషంలో వాటిని వెనక్కి తీసుకోవడం ఇటీవలి కాలంలో యావత్ భారత దేశం చూసింది. తాజాగా మార్చి 3 ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని దిల్లీ కోర్టు సోమవారం డెత్ వారెంట్ జారీ చేసినప్పటికీ.. ఈసారైనా ఉరి శిక్ష అమలవుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం పవన్ గుప్తా.
నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ గుప్తాకు ఉరి శిక్షను సవాలు చేయడానికి ఇంకా న్యాయపరమైన అవకాశాలున్నాయి. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయడం లేదా రాష్ట్రపతికి క్షమాభిక్ష అర్జీ పెట్టుకునే యోచనలో పవన్ గుప్తా ఉన్నట్టు.. అతడి తరఫు న్యాయవాది సోమవారం దిల్లీకోర్టుకు తెలిపారు.
2014 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. క్షమాభిక్ష అర్జీని రాష్ట్రపతి తిరస్కరించిన 14 రోజుల వరకు దోషికి ఉరిశిక్ష అమలు చేయకూడదు.
న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకోవాలని ఫిబ్రవరి 5న దిల్లీకోర్టు పవన్‌కు స్పష్టం చేసింది. అయితే పవన్.. అతడి కుటుంబ సభ్యులెవరు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అందువల్ల తాజా డెత్ వారెంట్‌ను సవాలు చేసే హక్కు పవన్‌కు లేదని నిర్భయ తల్లి తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
మరో దోషి అక్షయ్.. కొత్త క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.
ఇలా రెండు సార్లు...
తొలుత జనవరి 22న నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడాల్సి ఉండగా.. ఫిబ్రవరి 1కు వాయిదా పడింది. దోషులకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నందున మరోసారి వాయిదా వేస్తూ జనవరి 31న నిర్ణయం తీసుకుంది ట్రయల్ కోర్టు. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న నలుగురు దోషులకు మార్చి 3న మరణ శిక్ష విధించాలని మరోసారి డెత్‌వారెంట్ జారీ చేసింది.
ఇదీ చూడండి:- పదేళ్ల తర్వాత అమెరికా నుంచి వచ్చి టీచర్‌పై కేసు!