జమ్ముకశ్మీర్‌లో నిఘా వ్యవస్థను పెంచాయి భద్రతా బలగాలు. శ్రీనగర్‌లో శనివారం భద్రతా బలగాలపై జరిగిన గ్రనేడ్ దాడి సహా పలు ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలనూ విస్త్రతం చేశారు అధికారులు. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి.. లోయలో శాంతి భద్రతలు నెలకొల్పటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఉగ్రవాదులు ఎటువంటి దాడులకు పాల్పడకుండా.. వారి కార్యకలాపాలను విఫలం చేసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
హై అలర్ట్
పొరుగు దేశం నుంచి ఉగ్రవాదులు అక్రమంగా చొరబడకుండా ఉండటానికి లోయలోని అనేక ప్రాంతాల్లో అదనపు బంకర్లను ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా భద్రతను పెంచినట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్స్టేషన్లు సహా గతంలో ముష్కరులు రెండుసార్లు దాడి చేసేందుకు యత్నించిన శ్రీనగర్ విమానాశ్రయంలోనూ ముందు జాగ్రత్త చర్యగా భద్రత పెంచారు. ముఖ్యమైన ప్రదేశాల్లోనూ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నిఘాను ఏర్పాటు చేశారు.
వరుసగా 56వ రోజు కశ్మీర్ లోయలో జనజీవనం స్తంభించింది. మార్కెట్లు, ప్రజా రవాణా నిలిచిపోయాయి. ల్యాండ్‌లైన్ సేవలు పునరుద్ధరించినప్పటికీ అంతర్జాల సేవలపై సస్పెన్షన్ కొనసాగుతోంది.
మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మెహబూబ ముఫ్తీ , ఫరూక్ అబ్దుల్లా గృహ నిర్భందంలోనే ఉన్నారు.
ఇదీ చూడండి : పాక్ ప్రధాని భార్యకు అద్భుత శక్తి- అద్దంలో ఆమె కనిపించరట!