గుజరాత్ సూరత్‌లోని అదాజాన్ ప్రాంతంలోని డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందించే ప్రముఖ సంస్థ ఐవిపనాన్... మహిళా సిబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఓ మహోన్నత నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు ఏడాదికి 12 రోజులు వేతనంతో కూడిన రుతుక్రమం సెలవులు ఇవ్వాలని తీర్మానించింది. రుతుక్రమం సమయంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఎదురయ్యే మానసిక, శారీరక ఒత్తిడి నుంచి మహిళలకు ఉపశమనం కల్పించేందుకే ఇలా చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
జొమాటో ప్రేరణతో..
ఇటీవల జొమాటో తమ మహిళా సిబ్బందికి 10 రోజులు పీరియడ్ లీవ్స్ ప్రకటించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐవిపనాన్ వ్యవస్థాపకుడు భౌతిక్ శేఠ్ తెలిపారు. మహిళా సిబ్బంది ప్రతి నెల ఐదు రోజుల వ్యవధిలో ఎప్పుడైనా ఈ సెలవులు పొందవచ్చన్నారు.
"ఓ సంస్థ(జొమాటో) రుతుక్రమం సెలవులు ప్రకటించినట్లు విన్నాం. మేమూ ఈ విధమైన సెలవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. వారు సెలవు తీసుకున్నా లేదా ఇంటి వద్ద నుంచి పని చేసినా... వారికి ఉపశమనం కలిగినట్లు ఉంటుంది. మహిళల ఆరోగ్యం, సంతోషమే లక్ష్యంగా స్నేహపూర్వకమై పని వాతావరణ కల్పించాలనేదే సంస్థ ముఖ్య ఉద్దేశం. రుతుక్రమం సమయంలో మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడతారని తెలుసు."
- భౌతిక్ శేఠ్, ఐవిపనార్ వ్యవస్థాపకుడు
సంస్థ తీసుకున్న నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు మహిళా సిబ్బంది. 'దీని వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అందరి శరీరాలు ఒక్కటే. అయితే సమస్యలు వేర్వేరుగా ఉంటాయి. ఎక్కువ సమయం ఒకేచోట కూర్చోని పని చేయడం వల్ల ఆ సమస్యలన్నీ తలెత్తుతాయి. ఇప్పుడు కొంతవరకు ఉపశమనం కలుగుతుంది' అని ఓ మహిళా ఉద్యోగి చెప్పారు.
ఇదీ చూడండి: సరిహద్దులో తొలిసారి మహిళా వైద్యుల సేవలు