మసీదుల్లోకి మహిళలను అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల తో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయం వ్యక్తంచేసింది.
'ప్రచారాల కోసమే...'
మసీదుల్లో ముస్లిం మహిళలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించమని కేరళకు చెందిన అఖిల భారత హిందూ మహాసభ తొలుత ఆ రాష్ట్ర హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. కేవలం ప్రచారం కోసమే ఇలాంటి అంశాన్ని వినియోగించుకుంటున్నారని మండిపడింది. అనంతరం పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తాజాగా సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు నిర్ణయానికి మద్దతు పలికింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోమని తెలిపింది.
శబరిమల తీర్పు వల్లే...
శబరిమల అయ్యప్ప ఆలయం విషయంలో ఇచ్చిన తీర్పు కారణంగానే ఈ పిటిషన్‌నూ విచారణకు స్వీకరించినట్లు గతంలో కోర్టు పేర్కొంది.