ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు విస్తృత ధర్మాసనం అవసరం లేదని తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఐదుగురు సభ్యుల ధర్మాసనమే విచారణ చేపడుతుందని స్పష్టం చేసింది. బదిలీ చేసేందుకు ఏ కారణమూ కనిపించలేదని పేర్కొంది. జనవరి 23న కోర్టు... ఈ తీర్పును రిజర్వులో ఉంచింది.
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రద్దు రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది.
కేంద్రం వాదనలు..
అధికరణం-370 రద్దు అనేది ముగిసిన అధ్యయమని.. ఆ సత్యాన్ని అంగీకరించడం మినహా మరో ప్రత్యామ్నాయమేదీ లేదని గతంలో విచారణ సందర్భంగా కేంద్రం వాదించింది. అధికరణం-370కి సంబంధించి ప్రేమ్‌నాథ్ వర్సెస్ జమ్ము కశ్మీర్(1959), సంపత్ ప్రకాశ్ వర్సెస్ జమ్ము కశ్మీర్(1970) కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయంటూ పిటిషన్ దారులు వాదించడాన్ని వేణుగోపాల్ తప్పుపట్టారు. రెండు వేర్వేరు అంశాలకు సంబంధించిన తీర్పులుగా వాటిని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జనవరి 23న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా విచారణ బదిలీ అభ్యర్థనను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.