నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన పవన్ గుప్తాకు సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. నేరం జరిగిన సమయంలో తాను మైనర్ అంటూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. ఫలితంగా ఫిబ్రవరి 1న పవన్ సహా మరో ముగ్గురు దోషులు ఉరి శిక్షను ఎదుర్కోవడం అనివార్యమైంది.
కోర్టు అసహనం...
'మైనర్' వాదనపై దిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈనెల 17న పవన్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు ఆలకించింది. 2012 డిసెంబర్లో నేరం జరిగిన సమయంలో పవన్ గుప్తా వయస్సు 17 ఏళ్ల ఒక నెల 20 రోజులని వాదించారు అతడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్. దిల్లీ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే పవన్ వయస్సుకు సంబంధించిన ధ్రువపత్రాలు దాచిపెట్టారని ఆరోపించారు. ఇదే విషయంపై దిల్లీ హైకోర్టును ఆశ్రయించినా... అతడి పిటిషన్‌ను పొరపాటున కొట్టివేసిందని నివేదించారు. ఈ కేసులో అతడ్ని మైనర్‌గానే పరిగణించి, శిక్ష విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు.
ఈ వాదనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ అసహనం వ్యక్తంచేశారు. మైనర్ వాదనకు సంబంధించి 2018 జులై 9న పవన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు ఏదో కొత్త సమాచారంతో వచ్చి, పిటిషన్‌ను విచారించమంటే ఎలా అని ప్రశ్నించారు. చివరకు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.