దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్‌కు ఈ రోజు జీవితాంతం గుర్తుండిపోనుంది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి అఖండ విజయం సాధించిన రోజే.. తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు సునీత. ఫలితాలు వెలువడిన అనంతరం కుటుంబ సభ్యులు, పార్టీ నేతల సమక్షంలో కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు.
కేజ్రీవాల్ ఘన విజయం సాధించి తన పుట్టిన రోజు కానుకగా జీవితంలోనే అతిపెద్ద బహుమతి ఇచ్చారని చెప్పారు సునీత. దిల్లీ ప్రజలు నిజాన్ని గెలిపించారని అన్నారు.
నో క్రాకర్స్..
దిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో కార్యకర్తలు ఎవరూ బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించవద్దని ఆదేశించారు కేజ్రీవాల్. వాయు కాలుష్యాన్ని నియంత్రించాలని సూచించారు.
కేజ్రీవాల్ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని ఆప్ కార్యకర్తలు తెలిపారు. టపాసులు కాల్చబోమని స్పష్టం చేశారు. బదులుగా మిఠాయిలు పంచుకుని, బ్యాండ్ బాజాతో విజయోత్సవాలు నిర్వహించారు.
ఆప్ పార్టీ ఘన విజయం అనంతరం 'లగే రాహే కేజ్రీవాల్' ఎన్నికల ప్రచార గీతానికి నృత్యం చేసి, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సంబరాలు చేసుకున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.
వాయికాలుష్యాన్ని నియంత్రించే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్య హామీగా చేర్చింది ఆప్. అందుకే బాణసంచా పేల్చొద్దని నిర్ణయం తీసుకున్నారు కేజ్రీవాల్.
ఇదీ చూడండి: వారికి 'ఐ లవ్ యూ' చెప్పిన కేజ్రీవాల్