'మహానేత కావాలనుకుంటున్నారా? అయితే కలెక్టర్, ఎస్పీ కాలర్లు పట్టుకోండి?' ఈ గొప్ప సూత్రం చెప్పింది మరెవరో కాదు మాన్యశ్రీ ఛత్తీస్‌గఢ్ మంత్రివర్యులు కవాసి లక్మా. మరేం గాబరా పడకండి! ఇంతకీ ఏం జరిగిందంటే...
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో ఓ పాఠశాలను సందర్శించారు కవాసి లక్మా. అక్కడ విద్యార్థులతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం కలెక్టర్ కాలర పట్టుకుంటే నాయకులు అవుతారని వ్యాఖ్యానించారు.
" నువ్వు ఏం అవ్వాలి అనుకుంటున్నావ్? అని ఒక అబ్బాయిని అడిగా. నేను రాజకీయ నాయకుడిని అవుతా అన్నాడు. కలిసి భోజనం చేస్తున్న సమయంలో నన్ను ఒక ప్రశ్న అడిగాడు. మీరు పెద్ద నాయకుడు ఎలా అయ్యారు? అని అడిగాడు. నేను నాయకుడు కావాలంటే ఏమి చేయాలి అని అడిగాడు. కలెక్టర్, ఎస్పీల కాలర్లు పట్టుకో.. అప్పుడు కచ్చితంగా నాయకుడవు ఆవుతావు అని చెప్పాను"- కవాసి లక్మా, ఛత్తీస్‌గఢ్ మంత్రి
నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు!
తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు లక్మా. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సేవకోసం అవసరమైతే కలెక్టర్లు, ఎస్పీలతోనైనా పోరాడాలని చెప్పినట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి: మొహర్రం దృష్ట్యా కశ్మీర్లో మళ్లీ ఆంక్షలు..!