కరోనా మహమ్మారి అధిక సంక్రమణ రేటుకు మనుషుల మధ్య సాన్నిహిత్యమే (దగ్గరి పరిచయాలు) కారణమని నిర్ధరించింది భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్). వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భౌతికు దూరం పాటించటం, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యాధుల నియంత్రణ చర్యలు తప్పనిసరిగా అనుసరించాలని తెలిపింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనకు వచ్చిన ఇటలీ దేశస్థుల్లో కరోనా వైరస్ సంక్రమణ ఫలితాలను అధ్యయనంలో పేర్కొంది ఐసీఎంఆర్. దగ్గరి పరిచయాల్లో ముందస్తు లక్షణాలు, కరోనా లేని కేసులు గుర్తించినట్లు తెలిపింది. సామాజిక సంక్రమణను నిరోధించేందుకు పాజిటివ్ రోగులను ముందస్తుగా గుర్తించటం,నిర్బంధించడం, పరీక్షించడం చాలా ముఖ్యమని పేర్కొంది.
16 మంది ఇటాలియన్లు, ఒక భారతీయుడికి కరోనా సోకిన విషయంపై గత మార్చి-ఏప్రిల్ మధ్య పరిశోధన చేపట్టారు. దీనిపై ఐసీఎంఆర్ చేసిన అధ్యయనం.. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐజేఎంఆర్)లో ప్రచురితమైంది.
" డైమండ్ ప్రిన్సెస్ నౌక (19.2శాతం), గ్రాండ్ ప్రిన్సెస్ నౌక (16.6శాతం)తో పోలిస్తే సంక్రమణ రేటు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. 8 రోజులు సగటున 6 గంటల పాటు కలిసి ప్రయాణించటం వల్ల అధిక సంక్రమణ రేటు ఉండొచ్చు. ఇండెక్స్ కేసు తప్ప ఇతర కేసుల్లో పరీక్ష సమయంలో లక్షణాలు లేవు. సుమారు సగం పాజిటివ్ కేసుల్లో చికిత్స కొనసాగినన్ని రోజులు లక్షణాలు లేవు. దగ్గరి పరిచయాల్లో కొవిడ్-19 పరీక్షలు.. లక్షణాలు లేని కేసులను గుర్తించి, నిర్బంధించటానికి దారి తీశాయి. దాని ద్వారా మరింత సంక్రమణను అడ్డుకోగలం. లక్షణాలు కనబడిన, తీవ్రంగా అనారోగ్యానికి గురైన వారిలో.. కోలుకునే సగటు 33.3 శాతంగా ఉంది. కరోనా ప్రభావానికి గురైన క్లస్టర్లో మరణాలు, కేసుల నిష్పత్తి 11.5 శాతంగా ఉంది. "
– ఐసీఎంఆర్
17 మందికి...
గత ఫిబ్రవరి 21న 23 మంది ఇటాలియన్ పర్యటకులు, ముగ్గురు భారతీయులు దిల్లీకి చేరుకున్నారు. రాజస్థాన్‌లోని పలు పర్యటక ప్రాంతాలను సందర్శించారు. అందులో ఒక 69 ఏళ్ల ఇటాలియన్ ఫిబ్రవరి 29న జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది లక్షణాలతో జైపుర్‌లోని ఎస్ఎంఎస్ వైద్య కళాశాలలో చేరాడు. అనంతరం అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతని భార్యకు ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా సోకింది. ఇద్దరిని నిర్బంధ కేంద్రాలకు తరలించారు.
మిగతా 24 మంది మార్చి 2న ట్రైన్‌లోని ఒకే కంపార్ట్మెంట్లో దిల్లీకి పయణమయ్యారు. అనంతరం వారిని క్వారంటైన్ చేశారు. తొలుత వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. వారి నోటి కఫం, నాసిక వ్యర్థాలను తీసుకుని పరీక్షించగా 14 మంది ఇటాలియన్, ఒక భారతీయుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మార్చి 3 వరకు 26 మందిలో 17 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి. సంక్రమణ రేటు 64.4 శాతంగా ఉంది. 17 మందిలో 9 మందికి లక్షణాలు లేవు. ఆరుగురిలో స్వల్ప జ్వరం రాగా, ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.