కరోనా కారణంగా వాయిదాపడ్డ పదో తరగతి పరీక్షలు.. కర్ణాటక వ్యాప్తంగా గురువారం ప్రారంభమయ్యాయి. అన్ని పకడ్బందీ ఏర్పాట్లతో, తగినన్ని జాగ్రత్తలతో నిర్వహిస్తోన్న ఈ పరీక్షలు జులై 4 వరకు జరగనున్నాయి.
కర్ణాటక సెకండరీ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ బోర్డ్(కేఎస్ఈఈబీ) అధ్వర్యంలో జరిగే పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 8,48,203 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరికోసం 2,879 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ పోలీసు బందోబస్తు సహా.. ఆరోగ్య కార్యకర్తలను, రవాణా శాఖాధికారులను అందుబాటులో ఉంచారు.
నిబంధనలు తప్పనిసరి..
విద్యార్థులు భౌతికదూరం పాటించేలా అవసరమైన చర్యలు చేపట్టిన అధికారులు.. ఒక్కో గదిలో 18 నుంచి 20 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి కల్పించారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్ సహా.. చేతులను శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.
ప్రతిపక్షాలు వద్దన్నా..
రాష్ట్రంలో పరీక్షలు వద్దని ప్రతిపక్షాలు విన్నవించినా యడియూరప్ప సర్కారు ముందడుగు వేసింది. విద్యార్థుల జీవితంలో పదో తరగతి పరీక్షలు చాలా కీలకమని, అందుకే పకడ్బందీ ఏర్పాట్ల నడుమ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: కార్పొరేటర్ సాహసం- నగర ప్రజల ప్రశంసలు