ETV Bharat / bharat

బ్రెజిల్​తో బంధం బలోపేతం.. ద్వైపాక్షిక మైత్రికి కొత్త చివుళ్లు - Jair Bolzonaro news

గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు బ్రెజిల్​తో 15 కీలక ఒప్పందాలపై భారత్‌ సంతకాలు చేసింది. రక్షణ, భద్రత వాణిజ్య రంగాల్లో సహకారం పెంచుకొనేలా కార్యాచరణను ఇవి ఆవిష్కరించాయి. అమెజాన్‌ కార్చిచ్చు బాధ్యుడిగా అప్రతిష్ఠ మూటగట్టుకొన్నారు బ్రెజిల్‌ అధ్యక్షుడు జయిర్​ బొల్సొనారో. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన్ను ముఖ్య అతిథిగా భారత్‌ ఆహ్వానించడం పలువుర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. బ్రెజిల్‌తో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు భారత్‌ అంత ప్రాధాన్యం ఇవ్వడానికి వెనక చాలా కారణాలు ఉన్నాయి.

Strengthening the bond with Brazil
బ్రెజిల్​తో బంధం బలోపేతం.. ద్వైపాక్షిక మైత్రికి కొత్త చివుళ్లు
author img

By

Published : Jan 29, 2020, 8:10 AM IST

Updated : Feb 28, 2020, 9:00 AM IST

జయిర్‌ బొల్సొనారో... అమెజాన్‌ కార్చిచ్చు బాధ్యుడిగా అప్రతిష్ఠ మూటగట్టుకొన్న బ్రెజిల్‌ అధ్యక్షుడు. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన్ను ముఖ్య అతిథిగా భారత్‌ ఆహ్వానించడం పలువుర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. గత నవంబరులో ఆయన పేరు ప్రకటించే నాటికే ప్రపంచ పర్యావరణ ప్రేమికులు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ, ఆయనకు ఆతిథ్యమిచ్చే విషయంలో భారత్‌ మరో ఆలోచన చేయలేదు. బ్రెజిల్‌తో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు భారత్‌ అంత ప్రాధాన్యం ఇవ్వడానికి వెనక చాలా కారణాలు ఉన్నాయి.

కీలక ఒప్పందాలు..

గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఆ దేశంతో 15 కీలక ఒప్పందాలపై భారత్‌ సంతకాలు చేసింది. రక్షణ, భద్రత వాణిజ్య రంగాల్లో సహకారం పెంచుకొనేలా కార్యాచరణను ఇవి ఆవిష్కరించాయి. భారత్‌లో చెరకు రైతులకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలపై కొన్ని నెలల క్రితమే డబ్ల్యూటీఓలో బ్రెజిల్‌ ఫిర్యాదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌ చెరకు ఎగుమతులను బ్రెజిల్‌ రైతులు తట్టుకోలేకపోతున్నారు. వారు అధ్యక్షుడు బొల్సొనారోకు బలమైన మద్దతుదారులు కావడంతో బ్రెజిల్‌ ప్రభుత్వం డబ్ల్యూటీఓలో భారత్‌పై కేసు దాఖలు చేసింది. అయినా ఇరుదేశాల నాయకులు ద్వైపాక్షిక సంబంధాల పటిష్ఠతపైనే దృష్టిపెట్టారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులతో భారత్‌-బ్రెజిల్‌ సంబంధాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి.

దేశీయ ఇంధన అవసరాలను తీర్చేలా కొత్త మార్కెట్లను అన్వేషించకపోతే ఆర్థిక కష్టాల్లో చిక్కుకోవడం ఖాయమన్న విషయం భారత సర్కారుకు బాగా తెలుసు. అందుకే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. చమురు, సహజవాయు నిల్వలు అధికంగా ఉన్న దక్షిణ అమెరికాపై దృష్టిపెట్టింది. తొలుత వెనెజువెలా నుంచి చమురు దిగుమతి చేసుకొన్నా, అక్కడి నికోలస్‌ మడురో సర్కారుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కత్తికట్టడంతో మనకు చమురు దిగుమతులు కష్టమైపోయాయి. మరోపక్క పశ్చిమాసియాలో ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా ఆపేయాల్సి వచ్చింది. ఆపై అతిపెద్ద చమురు సరఫరాదారు ఇరాక్‌లో సంక్షోభ వాతావరణం నెలకొంది. సౌదీ నుంచి చమురు తెచ్చుకోవాలన్నా హర్మూజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు భారత్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌ ముందున్న ప్రత్యామ్నాయ మార్గం బ్రెజిల్‌.

ఇంధన అవసరాలు తీర్చే చర్యలు..

దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌ ప్రపంచలోనే చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో పదో స్థానంలో ఉంది. అక్కడి ప్రభుత్వరంగ సంస్థ ‘పెట్రోబ్రాస్‌’ అత్యంత వేగంగా ఎదుగుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే సంస్థల్లో మూడోస్థానానికి చేరింది. రష్యాకు చెందిన ‘రోస్‌నెఫ్ట్‌’, చైనాకు చెందిన ‘పెట్రో చైనా’ మాత్రమే ముందు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌కు చెందిన ‘ఓఎన్‌జీసీ విదేశ్‌’ ‘పెట్రోబ్రాస్‌’ నేతృత్వంలోని కన్సార్టియంలో భాగంగా బ్రెజిల్‌లో కొన్ని చమురు క్షేత్రాలను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇవన్నీ భారత్‌ ఇంధన అవసరాలు తీర్చే చర్యలే. రాజకీయంగా స్థిరత్వం, అమెరికాతో సత్సంబంధాలు ఉన్న బ్రెజిల్‌, మనదేశానికి నమ్మకమైన చమురు ఎగుమతిదారుగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2014-15లో 25 లక్షల డాలర్ల విలువైన చమురును దిగుమతి చేసుకోగా, 2019 ఆగస్టు నాటికి అది 21.70 కోట్ల డాలర్లకు చేరింది.
చమురు దిగుమతులను 2022నాటికి 10శాతం మేర తగ్గించుకునే లక్ష్యంతో జాతీయ జీవఇంధన విధానం 2018కి కేంద్రం ఆమోదం తెలిపింది. జీవ ఇంధనాల్లో ఇథనాల్‌ ముఖ్యమైంది. దీనికి 10శాతం పెట్రోలు కలిపి వాహనాలకు వాడాలని లక్ష్యంగా పెట్టుకొంది. అదే బ్రెజిల్‌లో 27శాతం వరకు కలుపుతున్నారు. ప్రతి కోటి లీటర్ల జీవ ఇథనాల్‌ వినియోగంతో రూ.28కోట్లు ఆదా అవుతుంది. ప్రధాని చెప్పిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే 400 కోట్ల లీటర్లకు పైగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాలి. భారత్‌లో చెరకు సాగు చేసే రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆహారధాన్యాలు వృథా కాకుండా వాడుకొనే అవకాశమూ లభిస్తుంది.

2022 నాటికి 15వందల కోట్ల డాలర్లు..

బ్రెజిల్‌ 1973లోనే ఇథనాల్‌ వినియోగంపై దృష్టిపెట్టింది. చెరకు నుంచి తయారు చేసే ఇథనాల్‌ ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. 2003 నుంచే అక్కడ పూర్తిగా ఇథనాల్‌తో నడిచే వాహనాలు పరుగులు తీస్తున్నాయి. భారత వ్యాపార సంస్థలూ సహజవనరులున్న బ్రెజిల్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. బ్రెజిల్‌ మార్కెట్‌ను దక్కించుకోగలిగితే ఎగుమతులకు ఢోకా ఉండదు. 2018 లెక్కల ప్రకారం భారత్‌ నుంచి 600కోట్ల డాలర్ల మేర ఐటీ, ఫార్మా, ఇంధన, వ్యవసాయం, గనులు, ఇంజినీరింగ్‌ రంగాల్లోకి పెట్టుబడుల రూపంలో వెళ్లగా- బ్రెజిల్‌ నుంచి వందకోట్ల డాలర్ల విలువైన ఆటొమొబైల్‌, గనులు, ఇంధనం, జీవ ఇంధన రంగాల్లోకి పెట్టుబడులు మన దేశానికి వచ్చాయి. దక్షిణ అమెరికాలోని కీలకమైన నాలుగు దేశాల కూటమి మెర్కసూర్‌ వాణిజ్య ప్రాధాన్య ఒప్పందంపై భారత్‌ 2003లోనే సంతకం చేసింది. ఇప్పుడు ఆ కూటమి దేశాలతో వాణిజ్య విలువ 1,000కోట్ల డాలర్లకు చేరింది. బ్రెజిల్‌తో మన వాణిజ్యం 800 కోట్ల డాలర్లుగా ఉంది. ఇరు దేశాల నేతలు 2022 నాటికి వాణిజ్యాన్ని 1,500 కోట్ల డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ క్రమంలో భారత్‌ వాణిజ్యలోటు తగ్గించుకొనే అవకాశం ఉంది. ఇక బ్రెజిల్‌కు రావాలనుకునే భారతీయులకు వీసా అవసరం ఉండబోదని గత అక్టోబరులో బోల్సోనారో ప్రకటించారు.

యూఎన్​ఎస్​సీలో..

బ్రిక్స్‌, బేసిక్‌, జీ-4, ఇబ్స వంటి అంతర్జాతీయ కూటముల్లో భారత్‌, బ్రెజిల్‌ సభ్యదేశాలు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం రెండు దేశాలూ ప్రయత్నిస్తున్నాయి. దక్షిణ అమెరికాలో చైనా ప్రాబల్యంపై బ్రెజిల్‌ అప్రమత్తంగా ఉంది. అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతున్నా ఇరాన్‌తో సంబంధాలను తెంచుకోవడానికి బ్రెజిల్‌ ఇష్టపడలేదు. బ్రెజిల్‌-భారత్‌ల మధ్య ఇలాంటి సారూప్యతలు అనేకం కనిపిస్తాయి. ఇప్పుడా భావసారూప్యత గల దేశాలు ఆర్థిక బంధాన్ని బలపరచుకొని అంతర్జాతీయ వేదికలపై పరస్పరం అండగా ఉండాలని నిర్ణయించడం కీలక పరిణామం!

(రచయిత-పెద్దింటి ఫణికిరణ్​)

ఇదీ చూడండి: చైనాలో కరోనా విలయతాండవం.. 131కి చేరిన మృతులు

Intro:Body:Conclusion:
Last Updated : Feb 28, 2020, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.