పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది పార్లమెంట్‌కే సాధ్యమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. కేరళ సహా ఏ రాష్ట్ర అసెంబ్లీకి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం లేదని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ కేరళ అసెంబ్లీ తీర్మానించిన నేపథ్యంలో రవిశంకర్ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"పౌరసత్వానికి సంబంధించి ఏదైనా చట్టాన్ని తయారు చేయాలంటే కేవలం పార్లమెంట్ ద్వారానే సాధ్యం. కేరళ అసెంబ్లీతో సహా ఏ అసెంబ్లీకి ఎలాంటి అధికారాలు లేవు. సీఏఏ భారతీయ పౌరులకు సంబంధించినది కాదు. వారికి పౌరసత్వాన్ని కల్పించడం కానీ తొలగించడం కానీ ఉండదు. ఇది హింసకు గురైన మైనారిటీల(మూడు దేశాల) కోసం మాత్రమే."-రవిశంకర్ ప్రసాద్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి.
మోదీ, అమిత్ షా చేస్తే తప్పా
ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు సంధించారు రవిశంకర్. ఉగాండ మైనారిటీలు, శ్రీలంక తమిళులకు మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు దేశ పౌరసత్వం కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ చేస్తే లేనిది అదే పనిని ప్రధాని మోదీ, అమిత్ షా చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. సీఏఏ పూర్తిగా రాజ్యాంగబద్దమన్నారు.
ఎన్పీఏ గురించి
జాతీయ జనాభా పట్టిక కేవలం దేశంలో నివసించే సాధారణ ప్రజల గురించిన సమాచారమని స్పష్టం చేశారు రవిశంకర్. దీనికి దేశ పౌరులతో సంబంధం లేదని పేర్కొన్నారు. జనాభా పట్టిక సమాచారాన్ని అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర, రాష్ట్ర పథకాలను అమలు చేయడానికి ఉపయోగిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: 'ఆర్పీఎఫ్'కు గ్రూప్- ఏ హోదా కల్పిస్తూ పేరు మార్పు