ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. పదోన్నతుల్లో రిజర్వేషన్ కోటా పొందడం ప్రాథమిక హక్కేమీ కాదని స్పష్టం చేసింది. 2012లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించకుండా ప్రభుత్వ ఉద్యోగాల నియామకం చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఉత్తరాఖండ్ హైకోర్టు గతంలో తిరస్కరించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హేమంత్ గుప్తా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. ఈ మేరకు తీర్పునిచ్చింది.
రాష్ట్రాలకు హక్కు లేదు...
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించొచ్చని చట్టంలో లేదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. అదే సమయంలో పదోన్నతులకు రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కల్పించరాదని స్పష్టం చేసింది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ల కల్పనకు తమ విచక్షణను ఉపయోగించుకోవాలని భావిస్తే ఆయా వర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఎక్కడ లేదో అన్న విషయంపై గణాంకాలను సేకరించి పరిశీలించాలని సూచించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని సమర్ధించిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అక్రమం అని పేర్కొని ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించింది.
ఇదీ చూడండి: సరిహద్దులో పాక్ దుశ్చర్య.. భారత జవాన్ మృతి