ఝార్ఖండ్‌లో నేడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఓటింగ్ జరగనున్న 17 నియోజకవర్గాల్లో 13,504 బ్యాలెట్ యునిట్లు, 8,772 కంట్రోల్ యునిట్లు, 9,123 వీవీప్యాట్ యంత్రాలు సిద్ధం చేశారు అధికారులు. 7,016 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని 1,008 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. మరో 543 స్టేషన్లను సున్నిత ప్రాంతాలుగా పేర్కొన్నారు. నక్సల్ ప్రభావం లేని ప్రాంతాల్లో 1,119 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక ప్రాంతాలుగా, 2,672 ప్రాంతాలను సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 40 వేల పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఝార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి వినయ్ కుమార్ తెలిపారు. అన్ని నియోజక వర్గాల్లో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాంచీ, హతియా, కాన్కే, బర్కతా, రామ్‌గర్ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.... ఇతర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.
బరిలో 309 మంది అభ్యర్థులు
ఈ ఎన్నికల్లో 309 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 56,18,267 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. ఈ విడత ఎన్నికలో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ వికాస్ మోర్చా అధ్యక్షుడు బాబులాల్ మరండి (ధన్వార్ నియోజకవర్గం), విద్యాశాఖ మంత్రి నీరా యాదవ్ (కొడర్మ) బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన ఏజేఎస్‌యూ పార్టీ అధినేత, మాజీ ఉపముఖ్యమంత్రి సుదేశ్ మహ్తో సిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఐదు విడతల ఎన్నికలు
ఐదు విడతలుగా జరగనున్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో... తొలి విడత నవంబర్ 30, రెండో విడత ఎన్నికలు డిసెంబర్ 7న జరిగాయి. తొలివిడతలో 13 నియోజకవర్గాలు, రెండో విడతలో 20 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. నాలుగో విడతలో 15 స్థానాలకు డిసెంబర్ 16న ఎన్నికలు జరగనుండగా... ఐదోవిడతలో భాగంగా 16 స్థానాలకు డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: ఝార్ఖండ్ 'రెండో విడత'లో 64.39 శాతం ఓటింగ్