రామమందిరం భూమిపూజ మొదటి ఆహ్వాన పత్రికను అయోధ్య భూవివాద కేసు న్యాయవాదులలో ఒకరైన ఇక్బాల్ అన్సారీ అందుకున్నారు. ఈ సందర్భంగా ఇక్బాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘ఇది రాముడి కోరిక అయ్యుంటుంది. అందుకే నాకు మొదటి ఆహ్వాన పత్రిక అందింది. దీనిని నేను స్వాగతిస్తున్నాను. అయోధ్యలోని హిందూ-ముస్లింలు సోదరభావంతో మెలుగుతారు’ అని న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐకి తెలిపారు. ‘ఆలయాన్ని నిర్మించిన అనంతరం అయోధ్య రూపురేఖలు మారిపోనున్నాయి. ఆలయం ప్రపంచ ఖ్యాతి పొందనుండటంతో పర్యాటకపరంగా స్థానిక ప్రజలకు ఉపాధి లభించనుంది. నగరం సైతం అందంగా మారనుంది’ అని అన్నారు.
‘రామమందిరానికి సంబంధించి ఎలాంటి మతపరమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినా వెళ్తాను. అయోధ్యలో అన్ని మతాలకు చెందిన దేవుళ్లు, దేవతలు ఉన్నారు. ఇది సాధువుల భూమి. ఇక్కడ రామమందిరం నిర్మిస్తున్నందుకు మేమంతా సంతోషంగా ఉన్నాం’ అని ఇక్బాల్ అన్సారీ అన్నారు.
ఈ నెల 5న భూమిపూజ..
ఈనెల 5వ తేదీన రామమందిరం భూమిపూజ నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ పాల్గొని భూమిపూజ చేయనున్నారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని అతికొద్దిమంది ప్రముఖులకే ఆహ్వానాలు పంపారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.
ఇదీ చదవండి: అయోధ్యలో యోగి- భూమిపూజ ఏర్పాట్ల పరిశీలన