హిమాచల్‌ప్రదేశ్ మండీ జిల్లాలోని లాల్ బహదూర్ శాస్త్రి వైద్య కళాళాలలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని పరిశీలించిన వైద్యులకు ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. అతని కడుపులో వింత వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి పొట్టలోంచి 8 చెంచాలు, 2 టూత్ బ్రష్‌లు, 2 స్క్రూ డ్రైవర్లు ఇతర వస్తువుల్ని వెలికి తీశారు. ఇందులో కూరగాయలు తరిగే కత్తీ ఉండటం గమనార్హం.
మండీ జిల్లా సుందర్‌నగర్‌లో నివాసం ఉండే కరణ్ సేన్ (35) అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు అతని సోదరుడు సురేష్ పథానియా తెలిపారు. మతిస్థిమితం సరిగా లేని కరణ్.. కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది.
"3 రోజుల క్రితం అతని కడుపుపై చిన్న కణతి లాంటిది గుర్తించాం. వెంటనే దగ్గరలోని క్లినిక్‌కు తీసుకెళ్లాం. పరిశీలించిన డా.ప్రదీప్ దానిపై గాటుపెట్టారు. అందులో చిన్న ఇనుప ముక్క ఉన్నట్లు గుర్తించారు. ప్రథమ చికిత్స చేసిన తరువాత వైద్య కళాశాలకు వెళ్లాలని సూచించారు. "
- సురేష్ పథానియా, కరణ్ సోదరుడు.
కరణ్ ఆసుపత్రిలో చేరిన వెంటనే ఎక్స్-రే తీసిన వైద్యులు పొట్టలో కొన్ని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. 4 గంటల పాటు శ్రమించి అతను మింగిన చెంచాలు, కత్తి, టూత్‌బ్రష్‌లు బయటకు తీశారు. కరణ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడని, అతనిని పరిశీలనలో ఉంచామని వెల్లడించారు వైద్యులు.
ఇలాంటి కేసును పరిశీలించటం ఇదే మొదటి సారని డాక్టర్ సూరజ్ భరద్వాజ్ తెలిపారు. చిన్న చిన్న పిన్నులు, బిల్లలు మింగిన కేసులను చూశాం కానీ ఇలాంటి కేసు చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కారుపై 'పేడ కోటింగ్'... చల్లటి ఐడియా గురూ!