అద్భుత కళాకారుడైన ఓ ప్రశాంత పోలీసు అధికారిని ఎప్పుడైనా చూశారా? అసలు అలాంటి వాళ్లుంటారా? పోలీస్ యూనిఫాంలో ఉన్న కళాకారుడు గురుప్రసాద్ అయ్యప్పన్‌ను చూస్తే ఎందుకుండరు? అని అనక మానరు.
యూనిఫాంలో ఉన్నప్పుడు గురుప్రసాద్ అయ్యప్పన్ ఓ బాధ్యత గల సీనియర్ సివిల్ పోలీస్ అధికారి. మిగతా సమయమంతా ఆయన ఓ అద్భుత శిల్పి. ఎన్నో ప్రశంసలు దక్కించుకున్న సృజనాత్మకత ఆయన సొంతం. కేరళలోని చాలా ప్రాంతాల్లో గురుప్రసాద్ చెక్కిన శిల్పాలు దర్శనమిస్తాయి.
అటు పోలీసుగా.. ఇటు శిల్పకళాకారుడిగా..
శాంతి భద్రతలు, చట్టాలను పరిరక్షించే ఉద్యోగం చేస్తున్నా.. గురుప్రసాద్‌కు కళ అన్నా, శిల్పాలు చెక్కడమన్నా ఎప్పుడూ మక్కువ పోలేదు. ఇప్పటివరకు తన ప్రతిభకు గానూ మూడు లలిత కళా అకాడమీ అవార్డులు గెలుచుకున్నారు. అటు.. ఉత్తమ పోలీసుగా 2017లో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పోలీస్ మెడల్ అందుకున్నారు. శిల్ప కళారంగంలో మూడు దశాబ్దాల పాటు శ్రమించి.. శిలను చెక్కడంలో ఓ విశిష్ట పద్ధతిని, శైలిని అభివృద్ధి చేశారు గురుప్రసాద్ అయ్యప్పన్. దానికి చతుర శిల్పకళ రీతి అనే పేరుపెట్టారు.
"పదేళ్ల క్రితం పాత పద్ధతులు, కిటుకులనే అనుసరించేవాడిని. పదేళ్లుగా శిల్పాలు చెక్కడంలో నా శైలి మార్చుకున్నాను. నా కళను విభిన్న శైలితో ఆవిష్కరించుకున్నాను. సంప్రదాయ రీతులతో పోలిస్తే ఇప్పటికి చాలా మార్పు కనిపిస్తోంది. నా శైలికి స్క్వేరిజం అని పేరు పెట్టుకున్నాను. క్యూబిజం నుంచే ఈ టెక్నిక్ తీసుకొచ్చాను. దీని ప్రత్యేకత ఏంటంటే పనిని సులభంగా మార్చి, శిల్పం అందంగా కనిపించేలా చేస్తుంది. ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా, ఎక్కువ స్థలాన్ని వినియోగించుకునేలా శిల్పం తయారుచేస్తాను. అలా శిల్పం అందం పెరుగుతుంది. స్క్వేరిజం ద్వారా తయారుచేసిన విగ్రహంలో ఏ భాగమైనా తొలగిస్తే.. ఆ తొలగించిన భాగం చతురస్రం లేదా దీర్ఘచతురస్రం ఆకారంలో ఉంటుంది. అంతేకాదు.. ఈ పద్ధతిలో తయారైన విగ్రహం ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. అందరికీ అర్థమయేలా సులభంగా ఓ శిల్పాన్ని చెక్కడమే ఈ పద్ధతి ప్రత్యేకత."
- గురుప్రసాద్ అయ్యప్పన్
ఆ మహాశివుడి ప్రతిమే సాక్షి..
కొల్లాం జిల్లాలోని కొట్టరక్కరాలో ఉన్న 44 అడుగుల మహాశివుడి విగ్రహం.. గురుప్రసాద్ నైపుణ్యానికి అద్దం పడుతుంది. ఓ బాధ్యతాయుత పోలీసు అధికారిగా, విశిష్ట ప్రతిభ గల ఓ శిల్పిగా గురుప్రసాద్ విజయవంతమైన ప్రయాణానికి ఈ భారీ శిల్పం ఉదాహరణ. పోలీసుగా తీరిక దొరకని సమయంలోనూ.. కైలాసనాథుడి శిల్పాన్ని పూర్తిచేశారు. శిల్పకళపై గురుప్రసాద్‌కు ఉన్న అభిరుచికీ, చిత్తశుద్ధికీ ఈ పొడవాటి విగ్రహం తార్కాణంగా నిలుస్తోంది. ఉత్తరాన కాసరగోడ్ నుంచి, దక్షిణాన కన్యాకుమారి వరకు కేరళవ్యాప్తంగా గురుప్రసాద్ చెక్కిన శిల్పాలు కనిపిస్తాయి.
ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ చేసిన గురుప్రసాద్.. కేరళ విశ్వవిద్యాలయంలో శిల్పకళ నేర్చుకున్నారు. పోలీసు ఉద్యోగం ఎంచుకున్నా, కళకు మాత్రం ప్రత్యేక సమయం కేటాయించేవారు. ప్రపంచ ప్రఖ్యాత శిల్పి దేవీప్రసాద్ రాయ్ చౌదరీ శిష్యుడైన ఎంసీ శేఖర్ వద్ద గురుప్రసాద్ శిక్షణ తీసుకున్నారు.
"ఓ కళను జీవనాధారంగా తీసుకున్న వారందరికీ బతుకు దెరువు కష్టంగా మారుతోంది. అలాంటి పరిస్థితుల్లోనూ కళాకారుడిలాగే, కళను నమ్ముకునే బతకాలని పోలీసు విభాగంలో చేరాను. కేరళ పోలీసు శాఖలో చేరి 22 ఏళ్లు గడుస్తోంది. ఇన్నేళ్లలో నాలోని పోలీసు, కళాకారుడు.. ఒకరి సాయంతో ఒకరు నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నారు. ఓ పోలీసుగా మరే వృత్తీ ఇవ్వలేని విభిన్న అనుభూతులు సొంతం చేసుకున్నాను. ఆ వృత్తే నాలోని కళాతృష్ణను ఎప్పటికప్పుడు ప్రోత్సహించింది. ఈరోజుల్లోనూ అన్ని స్థాయిల్లోని పోలీసులు వృత్తిపరమైన ఒత్తిడిని అధిగమించేందుకు ఏదో ఒక కళపై పట్టు పెంచుకోవాలని సూచిస్తున్నాను."
- గురుప్రసాద్ అయ్యప్పన్
ప్రజల్లో మంచిని పెంచడమే కర్తవ్యంగా..
గురుప్రసాద్ ఏటా శిల్పాల ప్రదర్శన నిర్వహిస్తారు. ఆయన భార్య ప్రీతి, పిల్లలు విధు ప్రసాద్, ఆదిత్య ప్రసాద్ ఆయన ప్రయాణంలో ఎప్పుడూ అండగా నిలిచారు. పోలీసుగా దేశానికి సేవ చేస్తూ.. కళాకారుడిగా ప్రజల్లో మంచితనాన్ని పెంపొందించడమే తన కర్తవ్యమని గురుప్రసాద్ చెప్తారు.
ఇదీ చదవండి: యూపీలో ఇద్దరు బాలికల 'ప్రేమ వివాహం'