ETV Bharat / bharat

మానవతామూర్తులు... మన నర్సులు!

author img

By

Published : Apr 6, 2020, 7:45 AM IST

మానవ మనుగడలో నర్సుల సేవలకు తరతరాల చరిత్రే ఉంది. స్వాతంత్య్రానికి పూర్వమే దేశంలో 'మంత్రసానుల' వ్యవస్థ ప్రాచుర్యంలో ఉండేది. ఆరోగ్య సదుపాయాలు లేని ఆ రోజుల్లో తల్లీబిడ్డల యోగక్షేమాలను మంత్రసానులే చూసేవారు. నేటికీ ఆదివాసీ, గ్రామీణ సమూహాల్లో పురుడు పోయడం, బాలింతల ఆరోగ్య సంరక్షణలో మంత్రసానుల పాత్ర అమోఘం. కాలక్రమంలో వైద్యవృత్తిలో నర్సులు అంతర్భాగమయ్యారు. రేపు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నర్సులపై ప్రత్యేక కథనం.

Special article on nurses who made immense contributions to the medical service
మానవతామూర్తులు... మన నర్సులు!

సామాజిక అభివృద్ధి సూచీల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం ప్రజారోగ్యం. దీనిపై ప్రజలకు అవగాహన కలిగించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 1991 నుంచి ఏటా ఏప్రిల్‌ ఏడో తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది 'నర్సులు, ప్రసూతి ఆయాలకు మద్దతుగా నిలుద్దాం' (సపోర్ట్‌ నర్సస్‌ అండ్‌ మిడ్‌వైఫ్స్‌) అనే నినాదాన్ని పాటించబోతోంది. యావత్‌ ప్రపంచాన్ని కరోనా అల్లకల్లోలం చేస్తున్న నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న అంశమిది. రోగులకు నర్సులు అందజేస్తున్న సేవలను ప్రపంచమంతా శ్లాఘిస్తున్న సమయమిది.

నర్సులదే బాధ్యత!

వైద్యులు మందులు ఇచ్చిన తర్వాత రోగుల బాధ్యత నర్సులదే. మొదటి రోజు నుంచి స్వస్థత చేకూరే వరకు రోగిని నర్సులు కంటికి రెప్పలా కాచుకుంటారు. అనేక సందర్భాల్లో వారు ఓపిగ్గా సహనంతో అందజేసే సేవలు రోగికి ఎంతో సాంత్వన కలుగజేస్తాయి. మానసిక ధైర్యాన్ని అందజేస్తాయి. అందువల్లే వారిని అపర దేవతామూర్తులుగా చూస్తారు. నర్సు వృత్తికి దక్కిన ఎనలేని గౌరవమది. ఇదంత సులువైన పని కాదు. వృత్తిపరమైన నైపుణ్యాలు అవసరం. చెదరని చిరునవ్వుతో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ రకరకాల రోగులకు సేవలు అందజేయాలి. తోబుట్టువులు, రక్తసంబంధీకులు చేయలేని పనులను సైతం వీరు సహనంతో చేస్తూ వృత్తిధర్మాన్ని పాటిస్తున్నారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. మానవ మనుగడలో నర్సుల సేవలకు తరతరాల చరిత్రే ఉంది. స్వాతంత్య్రానికి పూర్వమే దేశంలో 'మంత్రసానుల' వ్యవస్థ ప్రాచుర్యంలో ఉండేది. ఆరోగ్య సదుపాయాలు లేని ఆ రోజుల్లో తల్లీబిడ్డల యోగక్షేమాలను మంత్రసానులే చూసేవారు.

వైద్య వృత్తిలో అంతర్భాగం

నేటికీ ఆదివాసీ, గ్రామీణ సమూహాల్లో పురుడు పోయడం, బాలింతల ఆరోగ్య సంరక్షణలో మంత్రసానుల పాత్ర అమోఘం. తొలుత పోర్చుగీస్‌ దేశీయులు నర్సుల వ్యవస్థను ఇండియాకు తెచ్చారు. ఆపై 'ఈస్ట్‌ ఇండియా కంపెనీ' ఆధ్వర్యంలో మొదటి నర్సింగ్‌ స్కూలును 1871లో చెన్నైలో స్థాపించారు. కాలక్రమంలో వైద్యవృత్తిలో నర్సులు అంతర్భాగమయ్యారు. యుద్ధసమయాల్లో, విపత్కర పరిస్థితుల్లో వీరు అందజేసే సేవలు ఎంతో కీలకమైనవి. అయినా నర్సుల సంక్షేమం, స్థితిగతులకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో పూర్తి నివేదిక లేకపోవడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గమనించింది.

ఆమె తొలిసారిగా..

తొలిసారిగా ఈ ఏడాదే ప్రపంచ నర్సింగ్‌ నివేదికను విడుదల చేయడానికి పూనుకొంది. నర్సింగ్‌ వృత్తి స్థాపకురాలుగా, నర్సింగ్‌ వ్యవస్థకే మూలపుటమ్మగా బ్రిటిష్‌ సంఘసంస్కర్త ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ను పరిగణిస్తారు. నర్సింగ్‌ వృత్తి ఉన్నతికి చేసిన సేవల్ని గుర్తుచేసుకోవడానికి ఆమె జన్మదినమైన మే 12ను అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా పాటిస్తున్నారు. ఆ క్రమంలోనే నర్సుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ 1908లో 'ట్రైన్డ్‌ నర్సెస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా'ను ఏర్పాటు చేశారు.

కమిటీ సూచనల మేరకు..

స్వాతంత్య్రం తర్వాత తొలినాళ్లలో ప్రభుత్వం 'సముదాయ అభివృద్ధి కార్యక్రమం' పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజారోగ్యంపై దృష్టి సారించడంతో నర్సులు ఇందులో కీలకంగా మారారు. శ్రీవాత్సవ కమిటీ సూచనల మేరకు కీలక మార్పులు తెచ్చి, గ్రామీణ ప్రజారోగ్య రక్షణలో వీరిని ముఖ్య భాగస్వాముల్ని చేశారు. ప్రజారోగ్య రక్షణకై ప్రభుత్వాలు తయారు చేసే వివిధ విధానాల రూపకల్పనలో అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వాలకు తక్షణమే అందించడంలో వీరు ప్రధానపాత్ర పోషిస్తున్నారు.

కొరతగానే..

భారత నర్సింగ్‌ మండలి గణాంకాల ప్రకారం మనదేశంలో ప్రస్తుతం 19.4 లక్షల మేర నర్సుల కొరత ఉంది. జాతీయ ఆరోగ్య నివేదిక ప్రకారం 476మంది రోగులకు ఒక్క నర్సు మాత్రమే దేశంలో ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఒక నర్సు ఉండాలి. ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏడుగురు ఉండాలి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. నర్సులకు సరైన గౌరవం, హోదా, వేతనాలు అందజేయాలి. ఈ వృత్తికి మరింత గౌరవ మన్ననలు కలుగజేయాలి. నవతరం ఈ వృత్తిని ఎంచుకునేలా ప్రోత్సహించాలి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నర్సింగ్‌ వృత్తిని చేపట్టేవారు క్రమేణా తగ్గుముఖం పడతారు. ఈ పరిస్థితి ప్రజారోగ్య రంగం పాలిట శాపమవుతుంది.

ఎంతో అవసరం

దేశాభివృద్ధికి నాణ్యమైన మానవ వనరులు ఎంతో అవసరం. విలువైన మానవ వనరుల పరిరక్షణలో ఆరోగ్య శాఖ పాత్ర అపారం. ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల లభ్యత, వివిధ విభాగాల్లో నిపుణుల లభ్యత, వారి సమర్థత, పరిశుభ్రమైన తాగు నీరు అందుబాటు, స్వచ్ఛత, ఆరోగ్య రంగానికి కేటాయింపులు, మందుల నాణ్యత, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆరోగ్య సూచీని రూపొందిస్తారు. 2020నాటి ఆరోగ్య సూచీ ప్రకారం తైవాన్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా, జపాన్‌ తరవాతి స్థానాల్లో నిలిచాయి. మన దేశానిది 38వ స్థానం. సామాజిక అభివృద్ధి సూచీల్లో వైద్యానిది అగ్రస్థానం అయినప్పటికీ వాటికి సముచిత ప్రాధాన్యం లభించడం లేదన్నది కాదనలేని వాస్తవం.

అందని ద్రాక్ష

పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యవిద్య అందని ద్రాక్షగా మారింది. అందువల్ల అనేక మధ్యతరగతి కుటుంబాలు నర్సింగ్‌ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నాయి. భారత్‌లో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, తగిన ప్రోత్సాహం కొరవడటం వల్ల మెరుగైన జీతభత్యాల కోసం అనేకమంది విదేశీబాట పడుతున్నారు. ముఖ్యంగా దుబాయ్‌, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలకు నర్సింగ్‌ పట్టభద్రుల వలసలు సాగుతున్నాయి. మనదేశంలో గల నర్సింగ్‌ పాఠ్యప్రణాళిక (సిలబస్‌) సైతం అభివృద్ధి చెందిన దేశాలకు సరిపోయేలా ఉంది. పాఠ్యప్రణాళికలో ఉన్న అంశాలు కళాశాలల్లో గల సదుపాయాలకు పొంతన ఉండటం లేదు. ప్రాంగణ ఎంపికలూ తక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా అనేక కాలేజీల్లో సీట్లు భర్తీ కావడం లేదు. మిగతావాటికన్నా ఈ వృత్తికి సామాజిక హోదా, విలువ లభించకపోవడం ఈ దుస్థితికి కారణం.

కొరవడిన కనీస భద్రత

ప్రపంచ మహిళా ఉద్యోగినుల్లో 41శాతం నర్సింగ్‌ రంగంలోనే ఉన్నారు. మనదేశంలో నర్సుల సంఖ్యలో కేరళ, మేఘాలయాలు ప్రథమ ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. కేరళ యువతుల్లో అత్యధికంగా 38.4శాతం నర్సు వృత్తిలోకి ప్రవేశించి దేశ విదేశాల్లో సేవలు అందజేస్తున్నారు. అదే సమయంలో అనేకానేక సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు. నర్సులపై జరిగే హత్యాచారాలకు ముంబయిలో ‘రామచంద్ర శాంబుగ్‌’ ఉదంతం ఓ మచ్చుతునక. విధి నిర్వహణలో ఉన్న వార్డుబాయ్‌ లైంగిక వేధింపులకు గురై 42 ఏళ్లపాటు ఆమె మంచానికే పరిమితమై జీవన్మరణ పోరాటం చేసి ఈ మధ్యకాలంలోనే మృతిచెందారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలోనూ ఆస్పత్రుల్లో వెలుగు చూస్తున్న దాడుల ఘటనలు మానవత్వానికి మచ్చగా నిలుస్తున్నాయి. వైద్యవృత్తిలో ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా 50 లక్షల రూపాయల విలువైన బీమా ప్రకటించడమూ సానుకూల పరిణామం. కరోనా విధి నిర్వహణలో చనిపోతే కోటి రూపాయల పరిహారాన్ని దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

ఎన్నో సమస్యలు

పని ప్రదేశాల్లో నర్సులకు వేధింపులు, అరకొర వేతనాలు, జీతాల చెల్లింపుల్లో జాప్యం, ఎక్కువ పని గంటలు, విధుల్లో ఉన్న సిబ్బందిపై రోగి బంధువుల దాడులు, రాత్రి వేళల్లో విధులు నిర్వహించడం, వృత్తిపరంగా ఎదుగుదల లేకపోవడం... వంటి సమస్యల వల్ల నర్సులకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్నది నిష్ఠురసత్యం. ముఖ్యంగా బడుగు వర్గాలకు ఉపాధి మార్గంగా ఈ వృత్తిపై ముద్రపడటం బాధాకరం. ప్రైవేటు రంగంలో పనిచేసేవారు ఒప్పందాల వల్ల మంచి అవకాశాలను వదులుకోవాల్సి వస్తోంది. క్షేత్ర పర్యటనల్లో దాడులు, అదనపు బాధ్యతలు, ఉద్యోగ అభద్రత వంటివి వీరి పని నాణ్యతపై ప్రభావం చూపుతున్నాయి. పని ప్రదేశాల్లో రసాయనాల ప్రభావం సైతం వీరి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశమే. అందువల్ల వీరికి వైద్యపరమైన సౌకర్యాలు కల్పించడం ఎంతో అవసరం. మాస్కులు, చేతి తొడుగులు, శానిటైజర్స్‌, స్వయంరక్షక దుస్తులు, వైద్య పరికరాలు వంటి కనీస సదుపాయాల కొరత వీరి ప్రాణహానికి కారణమవుతోంది.

గ్రామీణారోగ్యానికి కీలకం

నర్సింగ్‌ వృత్తిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దగలిగితే గ్రామీణ భారతం ఎదుర్కొనే అనేక ప్రాథమిక ఆరోగ్యసమస్యలకు పరిష్కారమూ లభిస్తుంది. గ్రామీణ ఆరోగ్య స్థితిగతులపై వీరికి సంపూర్ణ అవగాహన ఉంటుంది. విధాన రచనలో నర్సుల సలహాలు సైతం ఎంతో ఉపకరిస్తాయి. వీరిని సమాచారం సమకూర్చే వ్యక్తులుగా మాత్రమే పరిగణిస్తుండటం బాధాకరం. అలాగే 20 ఏళ్ల అనుభవం గల నర్స్‌ కేవలం సహాయకురాలిగానే మిగిలిపోతున్నారు. ఒక్క చిన్న మందు రాసిచ్చే అధికారమైనా వారికి లభించడం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నం. సర్వీసులో ఉన్నవారికి జ్ఞాన సముపార్జనకు ఉండే అవకాశాలు తక్కువ అన్నది నిర్వివాదాంశం.

వారికే సమస్యలు ఎక్కువ!

రెగ్యులర్‌ నర్సుల పరిస్థితుల కంటే ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేవారికి సమస్యలు ఎక్కువ. ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే గ్రామీణ నర్సుల పరిస్థితి మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్‌ నర్సులకు కల్పించే సౌకర్యాలు వీరికీ అందజేయాలి. జాతీయ ఆరోగ్య విధానం (2017) ప్రకారం ప్రస్తుత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఆరోగ్య రంగానికి ఉన్న కేటాయింపులు 1.28 శాతం నుంచి 2.5 శాతానికి పెంచాలని, ఆరోగ్య రంగంలో పబ్లిక్‌-ప్రైవేటు నమూనాను తెచ్చి ప్రజారోగ్యంపై అత్యధిక శ్రద్ధ పెట్టాలని సూచించింది. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 130 కోట్ల జనాభాకు అనుగుణంగా ఆరోగ్య రంగానికి నిధులు పెంచాలి. రాజ్యాంగ నిబంధన 21 ప్రకారం ప్రజారోగ్య బాధ్యత ప్రభుత్వాలదే. కరోనా నేపథ్యంలోనైనా ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచి, వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి!

-డాక్టర్​ రమేశ్​ బుద్దారం,

మధ్యప్రదేశ్​లోని గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు

ఇదీ చూడండి: కరోనా చీకటిపై దివ్వెల కాంతులతో దేశం పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.