సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమాజ్‌వాదీ పార్టీ పావులు కదుపుతోంది. తాజాగా పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ పేరును 'ప్రధాన ప్రచారకర్తల' జాబితాలో చేర్చింది.
శనివారం ఎన్నికల కమిషన్‌కు పంపించిన నలభై మంది పార్టీ ప్రధాన ప్రచారకర్తల జాబితాలో ములాయం సింగ్ యాదవ్ పేరు లేదు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆదివారం విడుదల చేసిన సవరించిన జాబితాలో ప్రథమ స్థానంలో ములాయం సింగ్ యాదవ్ పేరును చేర్చింది.
తాజా సవరణ జాబితాలో ములాయం సింగ్‌తో పాటు, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సీనియర్ నేత రాం గోపాల్ యాదవ్, ఆజామ్‌ఖాన్, డింపుల్ యాదవ్, జయా బచ్చన్ తదితరులు ఉన్నారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ములాయం.. మెయిన్‌పురి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచే ఆయన 1996, 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కనుక ఇదే సురక్షిత స్థానమని పార్టీ నమ్ముతోంది.
ప్రస్తుతం ఆయన ఆజాంఘడ్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ములాయం మెయిన్‌పురి, ఆజాంఘడ్ రెండు స్థానాల్లోనూ గెలుపొందడం విశేషం.
బీఎస్పీతో పొత్తులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాల్లో 37 చోట్ల ఎస్పీ పోటీచేయనుంది. రాష్ట్రంలో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఎన్నికలు జరగనున్నాయి.