దేశంలో క్రమక్రమంగా వర్షాకాలం తీరు మారుతోంది. ప్రాంతాలను బట్టి రుతుపవనాలు వాటి ప్రభావాన్ని చూపనున్నాయి. భవిష్యత్లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు ఐఐటీ ఖరగ్పుర్ పరిశోధకులు. దక్షిణ భారతదేశం, హిమాలయ పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాపాతం నమోదవుతుందని చెబుతున్నారు.
1971-2017 మధ్య కాలంలో దేశంలోని రుతుపవనాల డేటాను పరిశీలించగా ఈ విషయం తేలినట్లు పరిశోధకుల బృందం వెల్లడించింది. 1930 నుంచి 1970 నాటి డేటాతో ఈ లెక్కలను సరిపోల్చినట్లు వివరించింది. గత ఐదు దశాబ్దాల్లో ఉత్తర, మధ్య భారతంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో వర్షపాతం పెరిగినట్లు గుర్తించామని పరిశోధకుల బృందం తెలిపింది.
రుతుపవనాలు దక్షిణ ఆసియా, దక్షిణ భారతదేశం వైపు దిశ మార్చుకుంటున్నట్లు తమ పరిశోధన ద్వారా కనుగొన్నట్లు ఐఐటీ ఖరగ్పుర్ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ రాజీవ్ మైటీ చెప్పుకొచ్చారు. దక్షిణాన అధిక వర్షాలు పడటానికి అధిక ఉష్ణోగ్రతలే కారణమని వివరించారు.
" హిందూ మహాసముద్రంపై ఎండ ప్రభావం అధికంగా ఉండటమే దేశంలో రుతుపవనాల దిశ మారడానికి ప్రధాన కారణం. మార్పు భవిష్యత్లో స్పష్టంగా కనిపిస్తుంది. మయన్మార్, థాయిలాండ్, మలేషియా వంటి దేశాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది.
-ప్రొఫెసర్ రాజీవ్ మైటీ
తమ పరిశోధన వివరాలు ఇటీవల నేచర్ పబ్లిషింగ్ గ్రూపునకు చెందిన 'సైంటిఫిక్ రిపోర్ట్స్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయన్నారు ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీరేంద్ర తివారీ. వర్షాలు అధికంగా పడితే పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు ఎంతో ప్రయోజనకరం అని అందులో పేర్కొన్నట్లు వెల్లడించారు.
"దక్షిణ ఆసియా నీటిపారుదల వ్యవస్థలో మెరుగ్గా ఉంది. వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేయడం అక్కడ ఎక్కువ. మా పరిశోధన భవిష్యత్లో వారు వ్యవసాయానికి సంబంధించి సరికొత్త ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది."
-ప్రొఫెసర్ వీరేంద్ర తివారీ, ఇనిస్టిట్యూట్ డైరెక్టర్