దేశంలో ప్రజాస్వామ్యం అత్యంత దయనీయ పరిస్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ప్రజా సమస్యలపై పార్టీ నేతలందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జ్ల సమావేశంలో పార్టీ నేతలకు ఈ మేరకు సూచించారు సోనియా. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు .
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, మధ్యప్రదేశ్లో 18 శాసనసభ స్థానాలు సహా ఇతర రాష్ట్రాల్లో జరిగే ఉపఎన్నికలకు ముందు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, హాథ్రస్లో దళిత యువతిపై హత్యాచార ఘటన, యూపీలో శాంతిభద్రతలు వంటి అంశాలను లేవనెత్తుతోంది కాంగ్రెస్. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది.