నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్ విఫలమైందని పేర్కొన్నారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. ఇది దేశానికే విజయమని ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.
రైతుల ఆందోళనలపై విపక్షాలు రాజకీయం చేస్తున్నారని పునరుద్ఘాటించారు స్మృతి. కానీ వారి రాజకీయాలు కూడా విఫలమయ్యాయని పేర్కొన్న కేంద్రమంత్రి.. అందుకు కారణమైన దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వెల్లడించారు.
కనీస మద్దతు ధరపై విపక్షాలు అన్నదాతలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు స్మృతి. సెప్టెంబర్- డిసెంబర్ 5 మధ్య 336లక్షల మెట్రిక్ టన్నుల వరిని.. 33లక్షల రైతుల నుంచి రూ. 60వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వం కొనుగోలు చేసిందని వివరించారు. ఇందులో 60శాతం లబ్ధిదారులు పంజాబ్ రైతులేనని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- 'మోదీ సంస్కరణలు దొంగతనంతో సమానం'
'అన్నీ సర్దుకుంటాయ్..'
నిరసనకారులకు నూతన సాగు చట్టాలపై అవగాహన కల్పించి, వారి ఫిర్యాదులు వినడం వల్ల.. ఆందోళనలు తగ్గిపోయి, కేంద్రం- రైతుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తమకున్న సమస్యలపై రైతులు నిరసన చేస్తుంటే.. విపక్షాలు ఆ ఆందోళనలను కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నాయని ఆరోపించారు జావడేకర్. గతంలో ఇవే సంస్కరణలను తమ మేనిఫెస్టోలో పెట్టుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు చట్టాలను వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. తాము చట్టాలు చేస్తే ఒప్పు.. ప్రధాని మోదీ చేస్తే తప్పు అన్నట్టు ప్రవర్తిస్తోందని విమర్శించారు.
ఇదీ చూడండి:- రాజ్నాథ్తో పవార్ భేటీ- రైతు నిరసనలపై చర్చ?