అసలే ఎన్నికల కాలం. ఓటర్లను మచ్చిక చేసుకోవాలి. అందుకే ప్రచారంలో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు అభ్యర్థులు. కాలికి ముల్లు దిగితే పంటితో తీస్తాం అన్న తీరుగా వ్యవహరిస్తుంటారు కొందరు నేతలు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇలాంటి పనే చేశారు. ప్రచారానికి వచ్చిన సమయంలో ఓ ఊళ్లో తగలబడుతున్న పొలాల మంటలార్పేందుకు నేరుగా రంగంలోకి దిగారు. చేతిపంపుకొట్టి నీళ్లందించేందుకు సాయం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అమేఠీలో తిరుగుతున్నారు స్మృతి. మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు.
అమేఠిలోని పురబ్ ద్వారా గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆమె... అక్కడ తగలబడిపోతున్న ఓ పంట పొలాన్ని కాపాడేందుకు వాహనం దిగి ముందుకురికారు. దగ్గర్లో ఉన్న చేతిపంపును గమనించి తాను నీళ్లు తోడుతూ స్థానికుల సహాయంతో మంటల్ని ఆర్పేందుకు కృషి చేశారు. అగ్నిమాపక దళాన్ని రప్పించి మంటలు ఆరిపోయిన అనంతరం అక్కడి నుంచి కదిలారు స్మృతి.
ఇదీ చూడండి: అమెరికా ఆంక్షలతో వెనెజువెలాపై ఒత్తిడి