నేర చరిత్ర కలిగిన స్లమ్ భరత్ అనే రౌడీ షీటర్‌ను బెంగళూరు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. కన్నడ హీరో యశ్‌ను గతేడాది హత్య చేయడానికి ప్రయత్నించిన ముఠాలో స్లమ్ భరత్ ప్రధాన నిందితుడు.
రాక్‌స్టార్‌పై హత్యాయత్నం
గతేడాది మార్చి 7న స్లమ్ భరత్ అతని అనుచరులు నితేశ్, నిత్యానంద, మధు, పృథ్వీ.. కేజీఎఫ్ హీరో యశ్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. అయితే వారి పథకాన్ని ముందుగా తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. తరువాత భరత్ బెయిల్‌పై బయటకొచ్చాడు.
కరుడుగట్టిన నేర చరితుడు
పలు క్రిమినల్ కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న స్లమ్ భరత్‌ను రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేసి కర్ణాటకకు తీసుకొచ్చారు. పోలీసుల కథనం ప్రకారం, క్రైమ్ రీ కన్ష్స్ట్రక్షన్లో భాగంగా నిందితుడిని తను నేరాలు చేసిన ప్రదేశాలకు తీసుకెళ్లారు. అయితే భరత్ పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. తన దగ్గర ఉన్న అక్రమ ఆయుధంతో పోలీసులపై కాల్పులు జరిపాడు.
భరత్ పేల్చిన ఓ బుల్లెట్ నేరుగా పోలీసు ఇన్స్పెక్టర్కు తగిలింది. అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం మూలంగా ఆయన తప్పించుకోగలిగారు. మరో బుల్లెట్ పోలీసు వాహనానికి తగిలింది. తరువాత భరత్ తన అనుచరులతో కలిసి కారులో పారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసు బృందాలు నిందితులను వెంబడించాయి.
హేసరఘట్ట వద్ద పోలీసులు నిందితుడిని అడ్డగించడానికి ప్రయత్నించారు. అయితే భరత్ మరోసారి కాల్పులకు తెగబడ్డాడు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఫలితంగా ఓ బుల్లెట్ భరత్ పొత్తికడుపులోకి, మరో బుల్లెట్ అతని కాలిలోకి దూసుకుపోయాయి.
తీవ్రంగా గాయపడిన స్లమ్ భరత్‌ను పోలీసులు సప్తగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విక్టోరియా హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యంలో భరత్ ప్రాణాలు కోల్పోయాడు.
స్లమ్ భరత్‌పై హత్య, హత్యాయత్నం సహా 50కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: అమెరికా మతస్వేచ్ఛ కమిషన్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం