పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీ సీలంపుర్లో మంగళవారం పలు వాహనాలు, ప్రజాఆస్తులను ధ్వంసం చేశారు ఆందోళనకారులు. ఈ ఘటనకు సంబంధించి 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు... ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆందోళనలు చేసిన వారి నేరచరిత్రను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సీలంపుర్ ప్రాంతంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఇవాళ తెల్లవారుజాము నుంచే పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ద్విచక్రవాహనాలపై తిరుగుతూ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఈశాన్య దిల్లీలో 144 సెక్షన్..
పౌరసత్వ చట్టంపై హింసాత్మక ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు. ఈశాన్య దిల్లీ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
భారీగా ట్రాఫిక్ జాం..
అల్లర్ల నేపథ్యంలో దిల్లీకి చేరుకునే వాహనాలను దారి మళ్లించారు అధికారులు. నోయిడా నుంచి వచ్చే వారిని డీఎన్డీ, అక్షర్ధామ్ మార్గాల గుండా వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో మథురా రోడ్-కాలిందీ కుంజ్ మధ్య ఉన్న రోడ్ నంబర్ 13ఏ, డీఎన్డీ ఫ్లైఓవర్ ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఇదీ చూడండి: యోగికి వ్యతిరేకంగా స్వపక్ష సభ్యుల ధర్నా- విపక్షాల మద్దతు