బ్యాంకు పోటీ పరీక్షలు స్థానిక భాషలో నిర్వహించాలని దక్షణాది రాష్ట్రాల ఎంపీలు రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఎంపీల డిమాండ్‌ను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్.
రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా స్థానిక భాష అంశాన్ని లేవనెత్తారు కాంగ్రెస్ ఎంపీ జీసీ చంద్రశేఖర్. కన్నడలో మాట్లాడుతూ.. భారతీయ బ్యాంకు సేవల పరీక్షలు, ఇతర నియామక పరీక్షలు ఆంగ్లం, హిందీతో పాటు కన్నడలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఆ సమయంలో చంద్రశేఖర్ వ్యాఖ్యలను తర్జుమా చేసేందుకు ఎవరూ లేరు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అనువదించి సభ్యులకు వివరించారు.
కాంగ్రెస్ ఎంపీ చంద్రశేఖర్ లేవనెత్తిన స్థానిక భాష అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు.
"కర్ణాటక సభ్యుల ఆందోళనను పూర్తిగా అర్థం చేసుకున్నాను. కర్ణాటక నుంచి ఎంపికైన లోక్‌సభ సభ్యులతో ఈ అంశంపై సమావేశమయ్యాను. అన్ని రాష్ట్రాల స్థానిక భాషకు సంబంధించిన సమస్య అంశాన్ని సభ్యులు లేవనెత్తారు. ఈ అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందించేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. దీనిని పరిశీలిస్తాం."
- నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి.
ఇదీ చూడండి: నీరవ్ మోదీకి మరో షాక్- స్విస్ ఖాతాలు సీజ్