ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఇప్పటికే కొందరికి టీకా ఇచ్చినందున భద్రతా పర్యవేక్షణను మరింత పెంచాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)ను భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) కోరింది. అలాగే ఈ ప్రక్రియకు సంబంధించిన ప్రణాళిక, నివేదికను సమర్పించాలని చెప్పింది. మూడో దశలో ఉన్న వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఒక వాలంటీరుకు అనారోగ్య సమస్య తలెత్తడం వల్ల ఆక్స్‌ఫర్డ్ వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో భారత్‌లో కూడా ఆ ట్రయల్స్‌కు బ్రేక్ పడిన తరుణంలో ఎస్‌ఐఐను ఆదేశించింది డీసీజీఐ.
తదుపరి ఆదేశాలు అందేవరకు వాలంటీర్ల నియామకం చేపట్టవద్దని వెల్లడించింది. అంతేకాకుండా నియంత్రణ సంస్థ నుంచి అనుమతి పొందాలంటే ఎస్‌ఐఐ భారత్, యూకేకు చెందిన డేటా అండ్ సేప్టీ మానిటరింగ్ బోర్డ్(డీఎస్‌ఎంబీ) నుంచి పొందిన అనుమతి పత్రాన్ని సమర్పించాలని సూచించింది. అయితే.. డీఎస్‌ఎంబీ సమీక్ష జరుపుతోందని, దాని సిఫార్సులను అందజేస్తామని ఎస్‌ఐఐ వెల్లడించింది. అలాగే ట్రయల్స్‌లో భాగంగా భారత్‌కు చెందిన డీఎస్‌ఎంబీ ఎలాంటి భద్రతాపరమైన సమస్యలను గుర్తించలేదని నియంత్రణ సంస్థకు తెలిపింది.
ఇదీ చదవండి: దేశంలో 36లక్షలు దాటిన కరోనా రికవరీలు