కరోనా వచ్చింది. ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దుకాణాల బంద్‌తో బ్రెడ్డు ముక్క కూడా కరవైంది. అయితే, తమిళనాడులోని ఓ దుకాణం ఈ సమస్యకు పరిష్కారం చూపింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండానే 24 గంటలు బ్రెడ్ విక్రయిస్తోంది. అమ్మేవాళ్ల అవసరం లేకుండానే కొనుగోళ్లు పెంచుకుంది.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిరోజు ఒంటి గంట తర్వాత అన్ని దుకాణాలు మూసేయాలని ఆంక్షలు విధించింది తమిళనాడు ప్రభుత్వం. దీంతో అక్కడ కొందరు తినేందుకు ఏమీ దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, మయిలాదురయి కూరైనాడులోని 'ఆర్ఆర్ కేక్ కార్నర్' యజమాని జగన్నాథం.. ఈ సమస్యకు పరిష్కారం వెతికారు. సిబ్బంది లేకుండానే వినియోగదారులకు బ్రెడ్ కొనుక్కునే అవకాశం కల్పించారు.
ఒక్కో ప్యాకెట్‌కు రూ.30/- ధర ఖరారు చేసి.. డబ్బులు వేసేందుకు ఓ డబ్బా, బోలెడన్ని బ్రెడ్ ప్యాకెట్లతో దుకాణాన్ని తెరిచిపెడుతున్నారు. ఆ పక్కనే బోర్డుపై ఎలా కొనుగోలు చేయాలో రాసి పెడుతున్నారు. ఇంకేముంది, అవసరమున్నవారు డబ్బాలో డబ్బులు వేసి, బ్రెడ్ పట్టుకెళ్తున్నారు. విపత్తు సమయంలో చక్కటి ఆలోచన చేసినందుకు ప్రశంసిస్తున్నారు స్థానికులు.
"వినియోగదారులు కావలసినవి తీసుకుని, డబ్బులు డబ్బాలో వేసి వెళ్తున్నారు. కొందరు డబ్బులు ఇవ్వకుండానే బ్రెడ్ ప్యాకెట్లు తీసుకెళ్తున్నారు. కానీ, అందుకు మాకేం బాధ లేదు. ఈ లాక్డౌన్ సమయంలో అందరి కడుపు నిండాలనేదే మా కోరిక."
-జగన్నాథం, దుకాణ యజమాని