అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ అంత్యక్రియలు నేడు నిగంబోధ్ ఘాట్ వద్ద జరగనున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ప్రజల సందర్శించేందుకు తూర్పు నిజాముద్దీన్‌లోని స్వగృహంలో షీలా పార్థివ దేహాన్ని ఉంచారు. మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళతారు. అక్కడ నివాళులర్పించిన అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమౌతుంది.
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు 81 ఏళ్ల షీలా దీక్షిత్. ఫ్రాన్స్‌లో గతేడాది హృదయ సంబంధిత శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న క్రమంలో శనివారం సాయంత్రం గుండెపోటు రావడం వల్ల తుదిశ్వాస విడిచారు. మృతి వివరాలు తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు భౌతిక కాయం వద్దకు చేరుకుని సహచర నేత మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
ప్రముఖుల నివాళి
షీలా పార్థివ దేహం వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రద్ధాంజలి ఘటించారు. దీక్షిత్ నివాసానికి చేరుకున్న లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా దిల్లీ మాజీ సీఎం మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, భాజపా సీనియర్ నేత ఆడ్వాణీ భౌతిక దేహం వద్ద నివాళులర్పించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, నటి షర్మిలా ఠాగూర్ సహా కేంద్రమంత్రులు, వివిధ పార్టీల నేతలు షీల పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
రాష్ట్రపతి విచారం
"షీలా దీక్షిత్ మరణ వార్త బాధ కలిగించింది. ఒక సీనియర్ రాజకీయ నేతను కోల్పోయాం. రాజధాని ముఖచిత్రం మారడంలో షీలా కృషి గుర్తుంచుకోదగినది. "
-రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
ప్రధాని దిగ్భ్రాంతి
"షీలాజీ మరణం ఎంతో బాధించింది. ఆమెది స్నేహపూర్వక వ్యక్తిత్వం. దిల్లీ అభివృద్ధిలో ఆమె భాగస్వామ్యం మరువలేం. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి."
-ప్రధాని నరేంద్రమోదీ
కాంగ్రెస్ అగ్రనేతల సంతాపం
"మీరు లేరన్న మాట ఎంతో బాధ కలిగిస్తోంది. జీవితాంతం కాంగ్రెస్ వ్యక్తిగా ఉన్నారు. 3 సార్లు సీఎంగా దిల్లీ ముఖచిత్రాన్నే మార్చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి."
-కాంగ్రెస్ పార్టీ ప్రకటన
"దిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో షీలా దీక్షిత్‌తో సన్నిహితంగా పనిచేశాను. దిల్లీని మార్చేందుకు అంకిత భావంతో షీలాజీ పనిచేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దారు. తుది శ్వాస వరకూ కాంగ్రెస్ కోసం పనిచేశారు."
-సోనియా గాంధీ, యూపీఏ ఛైర్పర్సన్
"దిల్లీ ప్రజలకు షీలాజీతో ప్రత్యేక అనుబంధం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు పార్టీకి విజయం చేకూర్చి పెట్టిన ప్రథమ మహిళా నేత. దిల్లీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు."
-మన్మోహన్ సింగ్
"షీలాజీ మరణం ఎంతో బాధించింది. ఆమె కాంగ్రెస్ ప్రియ పుత్రిక. మూడు సార్లు దిల్లీ సీఎంగా ఎన్నికయి.. రాజధానికి ఎంతో సేవ చేశారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
రెండు రోజుల పాటు సంతాప దినాలు
షీలా దీక్షిత్ మరణంతో రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది దిల్లీ ప్రభుత్వం. ఈ మేరకు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియా ఓ ప్రకటన విడుదల చేశారు.
దిల్లీ అభివృద్ధిలో ముఖ్య భూమిక
దేశ రాజధాని దిల్లీ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించారు షీలా దీక్షిత్. 1998-2013 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. దిల్లీలో మౌలిక సదుపాయాల కల్పనకు విశేష కృషి చేశారు. అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు.
ఇదీ చూడండి: ఈ భూమిపై ఏ శక్తీ దాన్ని ఆపలేదు: రాజ్‌నాథ్‌సింగ్